ఐనవోలు, జూలై 8 : మండలంలోని కొండపర్తి గ్రామంలోని జడ్పీ పాఠశాల రాత్రి కురిసిన స్వల్ప వర్షానికే జలమయం అయింది. గతంలో పాఠశాల కాంపౌండ్ వాల్ ఆనుకొని సైడ్ డ్రైనేజీ ఉండేది. పాఠశాల ముందు నుంచి సైడ్ డ్రైనేజీ ద్వారా అండర్ డ్రైనేజీ లింక్‌తో రోడ్డుకు అటు వైపు వర్షం నీళ్లు పోయేవి. కానీ అండర్ డ్రైనేజీ పైపులు చాలా సంవత్సరాల క్రితం వేసినవి కావడం.. ఆ పైపుల మీదుగా భారీ గ్రానైట్ లారీలు నిత్యం వెళ్లడం వల్ల అండర్ డ్రైనేజీ పూర్తిగా కుంగింది. దీంతో ఆదివారం రాత్రి కురిసిన చిన్న వర్షానికే పాఠశాల ఎంట్రెన్స్ గేటు నుంచి ప్రైమరీ పాఠశాల సమావేశ వేదిక వరకు వర్షపు నీరు నిలిచింది. దీంతో విద్యార్థులు పాఠశాల లోపలికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. పాఠశాలకు వచ్చిన చిన్న పిల్లలు తిరిగి ఇంటికి వెళ్లడంతో విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల వద్దకు వెళ్లి దింపి వచ్చారు. స్థానిక ఎమ్మెల్యే వెంటనే స్పందించి కొండపర్తి పాఠశాల పక్కన సైడ్ డ్రైనేజీ, నీళ్లు రోడ్డు దాటి పోవడానికి అండర్ డ్రైనేజీ, ఈరన్న గుడి నుంచి పీరీల వరకు శాశ్వతమైన సైడ్ డ్రైనేజీ నిర్మించాలని విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు కోరుతున్నారు.