వరంగల్ ప్రతినిధి, జూలై 3 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్‌లో కొండా దంపతుల వివాదం కొనసాగుతున్నట్టేనా? అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయి. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఇటీవల చేసిన వరుస వివాదాస్పద వ్యాఖ్యలు ఉమ్మడి కాంగ్రెస్ నేతల్లో కలకలం రేపుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీకి కొండా దంపతులు కావాలా? మేము కావాలా? తేల్చుకోవాలని ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామ్రెడ్డి, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, మేయర్ గుండు సుధారాణి తదితరులు అధిష్టానానికి అల్టిమేటం జారీ చేయడం, ఆ తరువాత మురళి గాంధీభవన్‌లో పీసీసీ క్రమశిక్షణా సంఘం చైర్మన్, ఎంపీ మల్లు రవి సహా ఇతరులను కలవడం, తను చేసిన వ్యాఖ్యలకు వివరణకు బదులు ఉల్టా ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
ఈ పరిణామంతో ఖంగుతిన్న ఎమ్మెల్యేలు ఈనెల 5లోగా మురళిపై అధిష్టానం సీరియస్ యాక్షన్ తీసుకోవాలని డెడ్‌లైన్ విధించారు. ఈ గడువుకు రెండు రోజుల ముందే మంత్రి సురేఖ, మురళి గురువారం కాంగ్రెస్ వ్యవహారాల రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షి నటరాజన్‌తో హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో భేటీ అయ్యారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో తమ ఎదుగుదలను ఓర్వలేకనే ఎమ్మెల్యేలు తమపై ఫిర్యాదు చేశారని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఆమెకు మురళి 16 పేజీల లేఖను అందజేశారు.
జిల్లాకు చెందిన ఒక్కో ఎమ్మెల్యే, ఒక్కో నాయకుడికి సంబంధించిన పలు అంశాలను లేఖలో ప్రస్తావించారు. తన ఎమ్మెల్సీ పదవీకాలం ఇంకా రెండేండ్లున్నా రాజీనామా చేసి తాను కాంగ్రెస్‌లో చేరానని, ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ నుంచి గెలిచి పదవికి రాజీనామా చేయకుండానే తన కూతురు కావ్య కోసం పార్టీలో చేరారని మీనాక్షి నటరాజన్‌కు వివరించారు.
అలాగే పార్లమెంట్ ఎన్నికల నాటికి కావ్య ఎవరో తెలియకపోయినా ఎంపీని చేశామని ఆ లేఖలో పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొంగులేటి, తుమ్మల, కోమటిరెడ్డి సహా అందరూ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు మెజారిటీ భారీగా తగ్గిందని, ఒక్క మంత్రి సురేఖ నియోజకవర్గంలోనే స్వల్ప తేడా ఉందని లేఖలో గుర్తుచేశారు.
అదే ధోరణి..
కొండా మురళి వ్యవహారంపై కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్‌ను కలిసిన అనంతరం కొండా దంపతులు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్‌రెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి తదితరులపై గతంలో చేసిన ఆరోపణలే మళ్లీ చేశారు.
ఒక్కొక్కరిపైనా అధిష్టానానికి ఫిర్యాదు చేయడమే కాకుండా పోలీసులకు ‘రెడ్డి’ రంగు పులమడంపై సర్వత్రా చర్చ సాగుతున్నది. తాను బీసీ బిడ్డనని, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్‌కు సహకరిస్తానని, రేవంత్‌రెడ్డి పదేండ్లు సీఎంగా కొనసాగాలని ఆకాంక్షించడంలో ఆంతర్యం ఏమిటనే చర్చ సాగుతున్నది. మొత్తానికి ఎమ్మెల్యేల అల్టిమేటంతోనే కొండా దంపతులు హడలిపోయి అధిష్టానం వద్ద వాలిపోయారని ఒక వర్గం అంటుండగా, కొండా తీరులో మార్పులేదని మరో వర్గం చెబుతుండడం గమనార్హం.