గీసుగొండ, ఫిబ్రవరి 25 : కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి జాతరను విజయవంతం చేయాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఆలయ ప్రాంగణంలో శుక్రవారం ఏర్పాట్లపై ఆయన సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులను సూచించారు. తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాలన్నారు. జాతర నిధులను పూర్తిగా వాడాలన్నారు. జాతరలో కొబ్బరికాయలు, కొబ్బరి చిప్పలు, సైకిల్ స్టాండ్ వేలం దక్కించుకున్న వారు 24 గంటల్లో నగదును దేవాదాయ శాఖకు చెల్లించాలని, లేకపోతే టెండర్‌ను రద్దు చేయాలని సూచించారు. కొంత మంది టెండర్ డబ్బులు చెల్లించకుండా కాలయాపన చేస్తున్నట్లు తెలిసిందన్నారు. వైద్యశాఖ అధికారులు శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. మాస్కులు ధరించి జాతరకు రావాలని భక్తులను కోరారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పోలీసు ధర్మారావు, ఎంపీపీ సౌజన్య, తహసీల్దార్ వల్లెం సుహాసిని, ఈవో కమల, సర్పంచ్‌లు వీరాటి కవిత, వాంకుడోత్ రజిత, ఆలయ ఫౌండర్ శ్రీనివాసాచార్యులు, ఎంపీడీవో రమేశ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాజ్‌కుమార్, అర్చకులు రామాచార్యులు, సర్పంచ్‌లు అంకతి నాగేశ్వర్రావు, జైపాల్‌రెడ్డి, ప్రకాశ్, బాబు, సరోజ, అనిల్, రాధాబాయి, మల్లారెడ్డి పాల్గొన్నారు. అలాగే, మండలంలోని మచ్చాపురం గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు పత్తిపాక నారాయణ తల్లి కమలమ్మ అనారోగ్యంతో మృతి చెందగా, వారి కుటుంబసభ్యులను ఎమ్మెల్యే పరామర్శించారు. సర్పంచ్ బోడకుంట్ల ప్రకాశ్, ఎంపీటీసీ కంబాల రజిత పాల్గొన్నారు.