ఏటూరునాగారం, ఆగస్టు 3 : గిరిజన సంక్షేమానికి పెద్ద పీట వేసే ఐటీడీఏలో కీలకమైన పోస్టులు భర్తీకి నోచుకోవడం లేదు. కేవలం రెండు, మూడు పోస్టుల్లో మాత్రమే రెగ్యులర్ అధికారులు ఉండడం గమనార్హం. ఉమ్మడి జిల్లాలో ఏటూరునాగారం ఐటీడీఏ మినీ కలెక్టరేట్‌గా పిలువబడేది. కానీ నేడు అధికారులు లేక వెలవెలబోతున్నది. కొన్నింటిలో ఇన్చార్జీలు ఉండగా మరి కొన్నింటికి వారు కూడా లేరు. ఐటీడీఏ ఏర్పాటు చేసినపుడు ఉన్న డిపార్టుమెంట్లల్లో కొన్నింటిని ఎత్తివేశారు.
ఇక కొన్ని శాఖల్లోని కీలక పోస్టులు భర్తీకి కూడా నోచుకోవడం లేదు. దీంతో పరిపాలన అంతా గాడి తప్పుతోంది. ఐటీడీఏ కాస్త నిర్వీర్యమైపోతోంది. కింది స్థాయి ఉద్యోగులతోనే ఐటీడీఏ నిర్వహణ కొనసాగుతోంది. ఐటీడీఏలో పీవో, ఏపీవో, ఏవో, మేనేజర్, వ్యవసాయశాఖ, ఉద్యాన వన శాఖ, అకౌంట్స్ విభాగం, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, డిప్యూటీ డీఎంహెచ్‌వో, ఇంజినీరింగ్, విద్యా, మత్య్సశాఖ విభాగాలు ఐటీడీఏలో ఉంటాయి.
ఆయా విభాగాలకు అధికారులు ఉండాల్సి ఉండగా కొన్నింటికి ఇన్చార్జిలు ఉం డగా మరికొన్నింటికి అవి కూడా లేనట్లు తెలుస్తోంది. కేవలం ఐటీడీఏలో పీవో, గిరిజన సంక్షేమశాఖ విద్యా విభాగంలో డీడీ మాత్రమే రెగ్యులర్ పోస్టుల్లో ఉన్నారు. ఇక ఏపీవో పోస్టు ఖాళీ ఉండగా ఉట్నూరులో ఏపీవోగా పనిచేస్తున్న వసంతరావును ఇ క్కడ డిప్యుటేషన్‌పై నియమించారు. ఏవో పోస్టు ఖాళీ ఉండగా ఎస్వో రాజ్‌కుమార్‌కు ఏవోగా ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగించారు.
మేనేజర్ పోస్టులో సీనియర్ అసిస్టెంటు శ్రీనివాస్ ఇన్చార్జిగా ఉన్నారు. అసిస్టెంటు భద్రాచలం ఐటీడీఏలో పనిచేస్తున్న అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ సంతోష్ ఇక్కడ ఇన్చార్జిగా పని చేస్తున్నారు. ఇంజినీరింగ్ శాఖలో ఈఈగా పనిచేస్తున్న వీరభద్రం కొత్తగూడ సబ్ డివిజన్లో డీఈఈగా పని చేస్తూ ఇక్కడ ఈఈ ఎఫ్ఏసీగా కొనసాగుతున్నారు. ఏటూరునాగారం, పస్రా సబ్‌డివిజన్ డీఈఈలు ఉట్నూరు నుంచి డిప్యుటేషన్‌పై వచ్చి పనిచేస్తున్నారు.
ఇక ప్రాజెక్టు హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టులో ములుగు హార్టికల్చర్ ఆఫీసర్ ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. మరో రెండు హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టులు భర్తీకి నోచుకోవడం లేదు. మత్స్యశాఖ అధికారి పోస్టు, ప్రాజెక్టు అగ్రికల్చర్ ఆఫీసర్, అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులు భర్తీకి నోచుకోకపోగా కనీసం ఇన్చార్జి అధికారులు కూడా లేరు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పోస్టు ఖాళీ ఉండగా ములుగు ఆర్డీవో ఇన్చార్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
డిప్యూటీ డీఎంహెచ్‌వో పోస్టు ఖాళీ ఉండగా పీహెచ్సీలో పనిచేస్తున్న సీనియర్ వైద్యాధికారిని ఇక్కడ ఇన్చార్జిగా నియమించారు. ఏటీడీవో పోస్టులు కూడా ఖాళీగానే ఉన్నాయి. వీటితోపాటు పలు శాఖల్లో వివిధ కేడర్లలో పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఎంతో కాలంగా ఈ పోస్టులు భర్తీకి నోచుకోకున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇక అన్నింటిపై సరైన పర్యవేక్షణ లేకుండా పోయింది. రెగ్యులర్ పోస్టులో ఉన్న పీవో అన్నింటిపై ప్రత్యేక చొరవ చూపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో పీవోపై పర్యవేక్షణ భారం పెరిగింది. కీలక పోస్టుల్లో అధికారులు లేకపోవడంతో ఐటీడీఏ మూగ పోయినట్లుగా ఉంటుంది. కిందిస్థాయిలో పనిచేసే అధికారులు, ఉద్యోగులు లేకపోవడంతో ఉన్నతాధికారులు కూడా ఏం చేయలేని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తున్నది.