మహదేవపూర్, జూన్ 11: మహదేవపూర్ ప్రభుత్వ దవాఖాన వైద్యుల నిర్లక్ష్యం తోనే ఎల్కేశ్వరం గ్రామానికి చెందిన నాగరాజు మృతి చెందాడని బీఅర్ఎస్ మంథని నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు కేదారి గీత ఆరోపించారు. బుధవారం ఆమె మాట్లాడుతూ పేదవాడికి ఆరోగ్యం బాగా లేక ప్రభుత్వ హాస్పిటల్కు వెళ్తే అక్కడ పట్టించుకునే నాధుడే కరువయ్యారని, రోగం నయమవడం కాదు కదా స్మశానానికి పంపుతున్నారని మండిపడ్డారు. మృతుడి బంధువులు కలెక్టరేట్ ముందు ధర్నా చేసిన ఎవరు పట్టించుకోకపోవడం దారుణమన్నారు.
ఒక పేదవాడి చావు పై ప్రభుత్వానికి ఇంత నిర్లక్ష్యమా అని ఆమె ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్, స్థానిక మంత్రి స్పందించి వెంటనే ఘటన పై విచారణ జరిపించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్ ను తక్షణమే సస్పెండ్ చేయాలన్నారు. అలాగే నాగరాజు కుటుంబానికి ఎక్స్ గ్రేషియా చెల్లించి, ఇందిరమ్మ ఇళ్లు, మృతిని సోదరునికి ఉద్యోగం ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపట్టి ప్రభుత్వ వైద్యం పై పేద ప్రజల్లో నమ్మకం పెరిగేలా చూడాలన్నారు.