హనుమకొండ, ఏప్రిల్ 27 : ‘తెలంగాణ ఉద్యమం నుంచి నేటి వరకు బీఆర్ఎస్తో వరంగల్‌కు అనుబంధం ఉంది. 25 ఏండ్ల పార్టీ చరిత్రను తెలిపేలా ఇక్కడ రజతోత్సవ మహాసభను జరుపుకుంటున్నాం. ఓరుగల్లు గడ్డకు ప్రత్యేకత ఉంది. రాణి రుద్రమదేవి ఏలిన గడ్డ.. సమ్మక్క సారక్కల పోరుగడ్డ.. బమ్మెర పోతన కవితా మాధుర్యం పండించిన ఓరుగల్లుకు వంద నం’ అని పార్టీ అధినేత కేసీఆర్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అంతకు ముందు సభా వేదికపైకి చేరుకొన్న కేసీఆర్ అమరులకు పూలు చల్లి నివాళులర్పించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు.
కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడిలో మృతిచెందిన వారికి నివాళిగా నిమిషం పా టు మౌనం పాటించారు. తొలుత మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్వాగతోపన్యాసం చేశారు. అనంతరం కేసీఆర్ ప్రసంగిస్తూ 25 ఏండ్ల క్రితం ఎగిరిన గులాబీ జెండా మూగబోయిన తెలంగాణకు ఊపిరి పోసిందన్నారు. త్యాగాల పునాదులపై రాష్ర్టాన్ని సాధించుకున్నామన్నారు. అనేక మంది ఆత్మహత్యలు, బలిదానాలతో సిద్ధించిన తెలంగాణ పదేళ్లలో అన్ని రంగాల్లో అభివృద్ది చెందిందన్నారు. బీఆర్ఎస్ పాలనలో పెండింగ్‌లో ఉన్న దేవాదులను పూర్తి చేయడంతో పాటు మూడేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించుకున్నామని చెప్పారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అం దించామన్నారు.
హైదరాబాద్, వరంగల్ లాంటి పట్టణాల్లో ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న పేదలకు పట్టాలిచ్చామని, ఆనాడు బుల్డోజర్లతో మట్టిని తీస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పేరుతో నిరుపేదల ఇళ్లు కూల్చివేస్తున్నదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అసమర్థత, అవివేకం, అనుభవం లేని పాలనతో తెలంగాణలో 2014కు ముందున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆవేదన వెలిబుచ్చారు. చివరగా సభ నిర్వహణలో కీలక పాత్ర పోషించిన పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, దాస్యం వినయ్ భాస్కర్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, సభ కోసం భూములిచ్చి సహకరించిన ఎల్కతుర్తి, ఇతర గ్రామాల రైతులకు కేసీఆర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.