వేలేరు, జూలై 4 : మూడోసారి కుడా సీఎం కేసీఆరే అవుతారని, స్టేషన్ఘన్పూలో కలిసికట్టుగా పనిచేసి గులాబీ జెండాను ఎగురవేయాలని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. వేలేరులోని రెడ్డి సంఘం కమ్యూనిటీ భవనంలో మాజీ సర్పంచ్ విజయపురి మల్లికార్జున్, పీచరలో ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ గుజ్జుల రాంగోపాల్‌రెడ్డి అధ్యక్షతన మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో కడియం మాట్లాడారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో అభివృద్ధి వేగంగా జరుగుతున్నదని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని అభివృద్ధి, సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయన్నారు. మన రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు మరేరాష్ట్రంలోనైనా ఉన్నాయా ఆలోచించుకోవాలని సూచించారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటున్నదని తెలిపారు. ఇటీవల ఖమ్మం సభలో కాంగ్రెస్ నాయకులు తెలంగాణలో రూ.4వేల పింఛన్ ఇస్తామని చెప్పారని, మరి కర్ణాటకలో గెలిచిన కాంగ్రెస్ అక్కడ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ రూ.2వేల పింఛన్ ఇస్తుంటే.. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రూ.800 మాత్రమే ఇస్తున్నదని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు చేసే ఇలాంటి మోసపూరిత వాగ్దానాలను నమ్మి మోసపోవద్దని ప్రజలకు సూచించారు. పని చేసే ప్రభుత్వానికి, పార్టీకి, నాయకులకు మాత్రమే మద్దతిచ్చి గెలిపించుకోవాలని కోరారు. పరిపాలన సౌలభ్యం కోసం వేలేరు మండలాన్ని సీఎం కేసీఆర్ కొత్తగా ఏర్పాటు చేశారని, ఇక్కడ ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాల కోసం వేలేరు మండలవాసి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డితో కలిసి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వేలేరు రెడ్డి సంఘం భవనంలో అభివృద్ధి పనుల కోసం రూ.10లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు, వేలేరు సర్పంచ్ కాయిత మాధవరెడ్డి, పీచర సర్పంచ్ మ్యాక రవీందర్, మల్లికుదుర్ల సర్పంచ్ గోదల రాజిరెడ్డి, మాజీ సర్పంచ్ వీరయ్య, రెడ్డి సంఘం వేలేరు మండల అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, నాయకులు గట్టయ్య, మారబోయిన రాజు, మిలుకూరి రవీందర్, రాజు పాల్గొన్నారు.