లింగాల గణపురం: తెలంగాణ ఉద్యమంలో అసువులుబాసిన ఉద్యమకారుని కుటుంబానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అండగా నిలిచారు. ఆర్థిక సహాయం చేయడమే కాకుండా కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించారు. కష్టకాలంలో అండగా నిలిచిన కేసీఆర్‌ను ఆ కుటుంబం ఇలవేల్పుగా కొలుస్తున్నది. పార్టీ రజతోత్సవ వేడుకల నేపథ్యంలో కేసీఆర్ సేవలకు వారు గుర్తుచేసకున్నారు. లింగాల గణపురం మండలంలోని నవాబుపేటకు చెందిన ముత్తినేని శ్రీనివాస్.. కేసీఆర్ పిలుపుతో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. పలు ధర్నాలు, దీక్షల్లో పాల్గొన్నారు. రాష్ట్ర ఏర్పాటు ఆలస్యమవుతుండటంతో తీవ్ర కలతకు గురైన శ్రీనివాస్ 2010 జనవరి 13న ఒంటిపై కిరోసిన్ చల్లుకొని నిప్పంటించుకున్నారు. సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ చికిత్స పొందుతూ అదే ఏడాది మార్చి 11న మరణించారు.
ఆ సమయంలో కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మాటకు కట్టుబడి ఆ కుటుంబానికి ప్రభుత్వం నుంచి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించారు. శ్రీనివాస్ భార్య మంజులకు ఇరిగేషన్ శాఖలో అటెండర్ నౌకరి ఇప్పించారు. శ్రీనివాస్ భార్య మంజుల ఆ డబ్బులను కూతురు ఉషారాణి పేరున డిపాజిట్ చేశారు. అటెండర్ కొలువుతో కూతురుని డిగ్రీ, కుమారుడు ఉదయ్ కిరణ్‌ను ఇంటర్మీడియట్ చదివిస్తూ కుటుంబ పోషణ చేస్తోంది. దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ కుటుంబానికి రూ.10 లక్షల రావడం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడంతో కేసీఆర్ ఇలవేల్పుగా మారారు.