కాజీపేట, సెప్టెంబర్ 12 : ప్రపంచంలోనే మత సామరస్యానికి, సమైక్యతకు దర్గా కాజీపేటలోని హజరత్ సయ్యద్‌షా అఫ్జల్ బియాబానీ దర్గా ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలోనే పేరొందిన ఈ దర్శనీయ స్థలంలో జరిగే ఉత్సవాలకు దేశం నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి ముస్లింలు వస్తుంటారు. ముస్లింల మత సంప్రదాయం ప్రకారం మహిమాన్వితులైన దర్గాలకు మాత్రమే ఆకుపచ్చరంగు వేస్తారని భావిస్తారు. ఇలాంటి దర్గాలు ప్రపంచంలో మూడు మాత్రమే ఉన్నాయని సూఫీలు చెబుతుంటారు. వీటిలో మదీనా ఒకటి, రెండోది బాగ్దాద్, మూడో హజరత్ సయ్యద్‌షా అఫ్జల్ బియాబాని పేరిట వెలిసిన కాజీపేట దర్గా. ప్రపంచంలో ఇంత ప్రసిద్ధి చెందిన దర్గా తెలంగాణలోని హనుమకొండ జిల్లాలో ఉండడం విశేషమని పీఠాధిపతి జనాబ్ సయ్యద్ గులాం అఫ్జల్ బియాబాని (అలియాస్) ఖుస్రూపాషా తెలిపారు.
బియాబానీ దర్గాకు ఏడో పీఠాధిపతిగా ఖుస్రూపాషా..
దర్గా కాజీపేటలోని సయ్యద్‌షా అఫ్జల్ బియాబానీ దర్గాకు ప్రస్తుతం 7వ పీఠాధిపతిగా జనాబ్ సయ్యద్ గులాం అఫ్జల్ బియాబానీ ఆలియాస్ ఖుస్రూపాషా కొనసాగుతున్నారు. నాలుగు తరాల నుంచి ఏడుగురు పీఠాధిపతులు పనిచేశారు. మొదటి దర్గా పీఠాధిపతిగా సర్వర్ బియాబానీ, రెండో పీఠాధిపతిగా గులాం అఫ్జల్ బియాబానీ, మూడో పీఠాధిపతిగా మోహినుద్దీన్ బియాబానీ, నాలుగు పీఠాధిపతిగా షా అఫ్జల్ఖరీమ్ బియాబానీ, ఐదో పీఠాధిపతిగా మర్షద్పాషా మియాబానీ, ఆరో పీఠాధిపతిగా ఫారుఖ్పాషా బియాబానీ, ఏడో పీఠాధిపతిగా కుస్రుపాషా బియాబానీ కొనసాగుతున్నారు.
దర్గాను దర్శించుకున్న ప్రముఖులు
స్వాతంత్య్రానికి పూర్వం అసఫ్జాహీలు, రాజవంశీయులు, బ్రిటీష్ అధికారులు, జాగీర్దార్లు కాజీపేట దర్గాను దర్శించారు. స్వాతంత్య్రం తర్వాత కూడా ఎంతో మంది ప్రముఖులు దర్శించుకున్నారు.
ఇదీ నేపథ్యం..
మతపెద్దల ప్రకారం 1795లో కాజీపేటకు చెందిన సయ్యద్గులాం మోహియోద్దీన్ దంపతులకు అఫ్జల్ బియాబానీ జన్మించాడు. ఈయన చిన్నతనం నుంచే ఎన్నో మహిమలు ప్రదర్శించాడు. తన తోటి వారితో ఆడుకుంటూ ఒక గుంట తవ్వగా అది నీటితో నిండి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆయన 12 ఏళ్లకే ఖురాన్‌ను కంఠస్తం చేశాడు. 28వ ఏట ఇల్లు వదిలి మెదక్, వరంగల్ పరిసర ప్రాంత గుట్టల్లో 12 ఏళ్లు తపస్సు చేయగా దర్గా కాజీపేట శివారు బంధంచెరువు వద్ద జ్ఞానోదయం అయినట్లు ఖరమత్ గ్రంథంలో ఉంది. నాటి నుంచి పీడితులకు బియాబానీ సేవ చేసేవాడు. ఒకసారి మహ్మద్ ప్రవక్త బియాబానీకి కలలో కనిపించి నీవు ఖాజీ(మతగురువు)గా మారి ఇస్లాం మత ప్రచారం చేయాలని ఉపదేశించాడు. అప్పటికే ఆయనకు ఎక్కువమంది సిపాయిలు శిష్యులుగా మారారు. మరికొంతమంది సూఫీలు అయ్యారు. 1822లో జిల్లా ప్రజలు అనావృష్టితో బాధపడుతుంటే బియాబానీ వానల కోసం శిష్యులతో కలిసి భట్టుపల్లి కోటచెరువు వద్ద కూర్చొని ప్రార్థనలు చేయగా కరుణించి వర్షాలు కురిశాయని చెప్పేవారని పూర్వీకులు చెప్తుంటారు. బియాబానీ వెట్టిచాకిరీని వ్యతిరేకించేవాడు.
ఆయన ఎక్కువగా దర్గాలోని హరిజనవాడలో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించేవాడు. హరిజనవాడకు వచ్చిన రెవెన్యూ సిబ్బంది వారి సామాన్లను మడికొండ వరకు మోయాలని హరిజనవాడలో ఉన్న హజరత్‌ను ఆదేశించారు. దీనికి ఆయన వెనుకాడక వారి సామాన్లను మోయగా ఆ సామాన్లు అతని తలకు ఆనక గాలిలో వేలాడం చూసిన రెవెన్యూ సిబ్బంది హజరత్ కాళ్లపై పడి క్షమించాలని వేడుకొని శిష్యులుగా మారి వెట్టిచాకిరీ చేయించబోమని వాగ్దానం చేశారు. అలాగే మీర్జా అఫ్జల్‌బేగ్ అనే శిష్యుడు దమ్ము వ్యాధితో బాధపడుతూ అఫ్జల్‌ను వేడుకోగా ఒక గ్లాస్ చల్లటి నీటిని తాగించడంతో అతడు పూర్తి ఆరోగ్యవంతుడయ్యాడు. 1856లో సాఫార్ 26న ఆయన భగవంతుడిలో లీనమయ్యాడు. ఆ రోజున కుటుంబసభ్యులు, మత పెద్దలు ఈ దర్గాను నిర్మించి ఉత్సవాలను ప్రారంభించారు.