కాళేశ్వరం, నవంబర్ 15 : పవిత్ర కార్తిక పౌర్ణమి పర్వదినాన్ని శుక్రవారం వైభవంగా జరుపుకొన్నారు. వేకువజాము నుంచే భక్తజనంతో ఆలయాలన్నీ పోటెత్తగా, సాయంత్రం వేళ ప్రముఖ క్షేత్రాలతో పాటు ఊరూవాడలు కార్తిక దీపాల వెలుగులతో శోభిల్లాయి. హనుమకొండలోని చారిత్రక వేయిస్తంభాల రుద్రేశ్వరాలయం, భద్రకాళీ, ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయం, పాలకుర్తిలోని సోమేశ్వరాలయం, కాళేశ్వర-ముక్తీశ్వరాలయం సహా అన్ని ఆలయాల్లో ఉదయం నుంచే దర్శనం కోసం బారులు తీరారు.
రుద్రాభిషేకంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించగా అంతటా సందడి కనిపించింది. ఈ సందర్భంగా ఉసిరి, తులసి చెట్ల వద్ద దీపాలు వెలిగించారు. అలాగే పలుచోట్ల రాత్రివేళ లక్ష దీపోత్సవం, జ్వాలాతోరణం, అఖండ జ్యోతి వెలిగించగా భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి దర్శించుకన్నారు. అలా గే కాళేశ్వరంలోని కాళేశ్వర-ముక్తీశ్వర స్వామి వారి ఆలయం పౌర్ణమి సందర్భంగా భక్తులతో పోటెత్తింది.
ఉమ్మడి వరంగల్ నుంచే గాక ఇతర జిల్లాలు, రాష్ర్టాల నుంచి వచ్చిన వారితో త్రివేణి సంగమం పులకించింది. గోదావరి పుష్కరఘాట్ వద్ద భక్తులు పుణ్యస్నానాలు చేసి నదీమాతకు దీపాలు వదిలి, సైకత లింగాలను పూజించారు. కార్తిక మాసం పౌర్ణమి రోజున ఆలయానికి ఒకే రోజు రూ.9 లక్షల ఆదాయం సమకూరింది. ఉదయం 5గంటలకు ఐదు కలశాల్లో నదీ జలాలు తీసుకొచ్చి స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించగా, మధ్యాహ్నం 12 గంటలకు శివకల్యాణం జరిపించారు. అలాగే సత్యనారాయణ వ్రతాలతో పాటు ఆలయ ఆవరణలోని ఉసిరి, మారేడు చెట్లకు మహిళలు లక్ష వత్తులు, లక్ష ముగ్గులతో దీపాలంకరణ చేశారు. సాయంత్రం నది మాతకు హారతి ఇచ్చారు.