కాళేశ్వరం/వెంకటాపూర్, నవంబర్ 4 : కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా కాళేశ్వరం, రామప్ప ఆలయాల్లో సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాలు శివనామస్మరణతో మార్మోగాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరంలోని గోదావరి త్రివేణి సంగమం వద్ద మహిళలు ప్రత్యేక దీపాలు వదిలి, సైకత లింగాలకు పూజలు చేశారు.
అనంతరం ఆలయానికి చేరుకొని శని, కాలసర్పదోష నివారణ పూజలు చేసి కాళేశ్వర ముక్తీశ్వరుడిని దర్శించుకున్నారు. అలాగే శుభనందాదేవి (పార్వతి అమ్మవారు) ఆలయంలో కుంకుమార్చన చేశారు.
ఆలయంలోని తులసి, మారేడు చెట్టు వద్ద లక్ష వత్తులు, కార్తీక దీపాలు వెలిగించారు. కాగా, సాయంత్రం ఆలయ అర్చకులు గోదావరి మాతకు పంచ, కుంభ హారతి కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పూలు, పండ్లు, వస్ర్తాలు, కుంకుమ, పసుపు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ములుగు జిల్లా రామప్పలో శ్రీరామలింగేశ్వరస్వామికి అర్చకులు హరీశ్శర్మ, ఉమాశంకర్ పూజలు చేసి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. మామిడి, మారేడు చెట్ల వద్ద మహిళలు దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించారు. కాగా, స్వామి వారిని మహాకాళేశ్వరుడిగా అలంకరించారు. హనుమకొండకు చెందిన తవుటం రమాదేవి, కుటుంబ సభ్యులు స్వామికి వెండి మంగళహారతి ప్లేటు, మాణిక్యాలు బహుకరించినట్లు ఈవో బిల్లా శ్రీనివాస్ తెలిపారు.