హనుమకొండ, సెప్టెంబర్ 29 : విద్యుత్ లైన్లపై నుండి ఎట్టి పరిస్థితుల్లో బ్రాడ్ బ్యాండ్ కేబుల్ వైర్లు ఉండరాదని, రోడ్ నుంచి18 నుంచి 20 ఫీట్ల ఎత్తులో ఉండాలని కేబుల్, బ్రాడ్ బ్యాండ్ ఆపరేటర్లను ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి ఆదేశించారు. సోమవారం హనుమకొండ నక్కలగుట్టలోని ఎన్పీడీసీఎల్ విద్యుత్తు భవన్ నుండి 16 సర్కిళ్ల పరిథిలోని కేబుల్, బ్రాడ్ బ్యాండ్ ఆపరేటర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వరుణ్ రెడ్డి మాట్లాడుతూ క్రమపద్ధతిలో బ్రాడ్ బ్యాండ్ కు సంబంధించిన కేబుల్ వైర్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
రోడ్ క్రాస్సింగ్స్ లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఉపయోగంలో లేని కేబుల్ వైర్లను 3 నెలలలోపు తొలగించాలని ఆదేశించారు. ప్రతి బ్రాడ్ బ్యాండ్ కేబుల్ వైర్లలను జిఐఎస్ మ్యాపింగ్ చేసుకొని వాటి కో- ఆర్డినెట్స్ ఎన్పీడీసీఎల్కు అందచేయాలని అన్నారు. అందరి సహాయ సహకారాలతో ఆరు నెలల సమయంలో పూర్తి చేయాలని మా సంపూర్ణ మద్దతు ఉంటుందని సీఎండీ పేర్కొన్నారు. ఈ సమావేశంలో డైరెక్టర్లు వి.తిరుపతి రెడ్డి, టి.మధుసూదన్, సీఈలు రాజు మోహన్, అశోక్, సిజిఎం ఆర్. చరణ్ దాస్, వరంగల్ ఎస్ఈ కె. గౌతమ్ రెడ్డి, హన్మకొండ ఎస్ఈ పి. మధుసూదన్ రావు, జీఎం సురేందర్, డివిజినల్ ఇంజినీర్లు సాంబ రెడ్డి, మల్లికార్జున్, అనిల్ కుమార్, బీఎస్ఎన్ఎల్ డిజిఎం కిషన్, తదితరులు పాల్గొన్నారు.