హనుమకొండ చౌరస్తా, జనవరి 5 : ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరైన మేడారం(Medaram Jathara) సమ్మక్క-సారలమ్మ జాతర ఈనెల 25 నుంచి 31 వరకు జరగనున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సురక్షితమైన రవాణా సేవలు అందించడమే సంస్థ ప్రధాన లక్ష్యమని కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి.సోలోమన్ అన్నారు. జాతర విధులకు నియమించబడే డ్రైవర్లు, కండక్టర్లు తప్పనిసరిగా నిబంధనలు పాటించేలా నిరంతర పర్యవేక్షణ చేయాలని సేఫ్టీ డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్లు, సేఫ్టీ వార్డెన్లను ఆయన ఆదేశించారు.
జాతర సమీపిస్తున్న తరుణంలో సోమవారం వరంగల్‌లోని జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి కరీంనగర్ జోన్ ఈడీ సోలోమన్, రీజనల్ మేనేజర్ దర్శనం విజయభాను ముఖ్యఅతిథిగా హాజరై రాష్ర్టంలోని అన్ని డిపోలకు చెందిన సేఫ్టీ డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్లు, సేఫ్టీ వార్డెన్లకు ప్రయాణికుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణపై కీలక దిశానిర్దేశం చేశారు.
మేడారం జాతర సందర్భంగా భారీగా ప్రయాణికుల రద్దీ రానున్న దృష్ట్యా తెలంగాణ రాష్ర్ట రోడ్డు రవాణా సంస్థ పరిధిలోని అన్ని డిపోల సేఫ్టీ డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్లు, సేఫ్టీ వార్డెన్లు సూచనలను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. విధుల్లో ఉన్న సిబ్బంది ప్రయాణికులతో మర్యాదపూర్వకంగా, క్రమశిక్షణతో వ్యవహరించేలా అవగాహన కల్పించాలన్నారు. మద్యం సేవించి విధులకు హాజరవడం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వంటి అనుచిత ప్రవర్తనలకు చర్యలు తీసుకుంటామని స్పష్టంగా తెలియజేయాలన్నారు.
ట్రాఫిక్ జామ్‌లు కాకుండా ఉండేందుకు, జిల్లా యంత్రాంగం, ట్రాఫిక్ పోలీస్ ఇతర శాఖలతో సమన్వయం కొనసాగించాలన్నారు. వీధుల్లో వాహనాలు నిలిచిపోవడం, ప్రమాదాలు లేదా ఇతర అసాధారణ సంఘటనలు జరిగిన వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించాలన్నారు. మేడారం జాతర విధుల్లో పాల్గొనే సిబ్బందిపై ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగిస్తూ, ఏవైనా లోపాలు గుర్తించిన వెంటనే సరిదిద్దే చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో వరంగల్ డిప్యూటీ రీజనల్ మేనేజర్లు పి.మహేష్, కేశరాజు భానుకిరణ్, డిపో మేనేజర్లు పి.అర్పిత, రవిచంద్ర పాల్గొన్నారు.