నర్పింహులపేట, అక్టోబర్ 25 : రైతు నెత్తిన మరో పిడుగు పడింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన ‘కపాస్ కిసాన్’ యాప్ రైతుల పాలిట శాపంగా మారింది. రైతులు పంట పండించడానికి ఎంత కష్టపడుతారో.. దానిని అమ్ముకోవడానికి అంతకు మించి కష్టపడాల్సిన పరిస్థితి దాపురించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనతో ఇక పత్తి రైతులు తమ పంటను అమ్ముకోవాలంటే తప్పనిసరిగా స్మార్ట్ ఫోన్ల ఆపరేటింగ్ నేర్చుకోవాల్సిందే. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ‘కపాస్ కిసాన్’ యాప్ తీసుకొచ్చింది. దీని ద్వారానే పత్తి అమ్మకాలు జరపాలనే నిబంధన పెట్టింది. దీంతో ఏఈవోలు పత్తిసాగు చేసిన రైతుల వివరాలు సేకరిస్తున్నారు.
ఎన్ని ఎకరాలు సాగు చేశారు? ఎక్కడ అమ్ముకోవాలనుకుంటున్నారు?, దగ్గరలోని ఏ మార్కెట్, ఏ మిల్లుకు తీసుకెళ్తారనే వివరాలతోపాటు పట్టాదారు పాస్ పుస్తకం, బ్యాంకు ఖాతా నంబర్ యాప్లో నమోదు చేయాలి. లేకపోతే పండించిన పత్తిని ప్రభుత్వం కొనుగోలు చేయదని చెబుతున్నారు. 12 శాతం కంటే తక్కువ తేమ, పొడుగు దూది, క్వింటాకు రూ. 8110, మధ్యరకంగా ఉంటే రూ. 7100 మద్దతు ధర నిర్ణయించారు. స్లాట్ బుక్ చేసుకున్న రోజు నుంచి పంట నమోదు చేసుకున్న 20 రోజుల వరకు స్లాట్ బుక్ చేసుకుంటే వారం రోజుల వరకు అమ్ముకునే అవకాశం ఉంటుంది. రైతు ఇష్టం వచ్చిన రోజు బుక్ చేసుకొని అమ్ముకోవచ్చు. మూడుసార్లు మాత్రమే స్లాట్ బుక్ చేసుకునే అవకాశం ఉంది. 4వ సారి అవకాశం లేదు. కౌలు వివరాలు నమోదు చేసినా పట్టాదారు ఫోన్కు మాత్రమే ఓటీపీ వస్తుంది.
రైతు మొదట ‘కపాస్ కిసాన్’ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫోన్ సంబర్ నమోదు చేస్తే ఓటీపీ వస్తుంది. దాన్ని నమోదు చేయాలి. తర్వాత ఛేంజ్ ప్రొఫైల్, రిజిస్టర్ డిటేయిల్, భూమి నమోదు, స్లాట్ సేల్స్ వివరాలు నమోదు చేయాలి. ఈ తతంగమంతా తెలియక రైతులు తిప్పలు పడుతున్నారు. కొందరు రైతులు కౌలుకు తీసుకొని పత్తిసాగు చేస్తున్నారు. వారి వివరాలు కూడా ఇందులో నమోదు చేయాలి. వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులకు శిక్షణ ఇచ్చినా.. ఇప్పటి వరకు గ్రామాల్లో పత్తిసాగు చేసే రైతులకు అవగాహన కల్పించలేదు. స్మార్ట్ ఫోన్లపై అవగాహన లేక రైతులు అవస్థలు పడుతున్నారు.