ఖిలావరంగల్, మార్చి 17: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలు ఇంటికి దీపంలా మారాయి. కంటి లోపాలతో బాధపడుతున్న ఎంతో మందికి వెలుగునిస్తున్నాయి. ఇందులో భాగంగా జిల్లాలో శిబిరాలు ప్రారంభించిన నాటి నుంచి శుక్రవారం వరకు 2,65,473 మందికి కంటి పరీక్షలు చేసినట్లు డీఎంహెచ్వో డాక్టర్ కే వెంకటరమణ తెలిపారు.
ఇప్పటి వరకు 136 గ్రామ పంచాయతీలు, 41 మున్సిపాలిటీ వార్డుల్లో కంటి వెలుగు పరీక్షలు పూర్తి చేశామని తెలిపారు. అలాగే, 25 పంచాయతీలు, 19 మున్సిపాలిటీ వార్డుల్లో కంటి వెలుగు శిబిరాలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. 1,24,905 మంది పురుషులు, 1,40,248 మంది మహిళలు, 305 మంది హిజ్రాలు నేత్ర పరీక్షలు చేయించుకున్నారని చెప్పారు. 1,99, 981 మందికి ఎలాంటి కంటి సమస్యలు లేవని నిర్ధారణ అయినట్లు తెలిపారు. 39,917 మందికి రీడింగ్ గ్లాసులు అందజేసి, 25,575 మందికి ప్రిస్క్రిప్షన్ గ్లాసుల కోసం ఆర్డర్ చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలు నేత్ర వైద్య శిబిరాలను వినియోగించుకోవాలని డీఎంహెచ్వో కోరారు.
కంటి వెలుగు శిబిరం పరిశీలన
కరీమాబాద్: కంటివెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని 32వ డివిజన్ కార్పొరేటర్ పల్లం పద్మ కోరారు. డివిజన్లోని బీఆర్నగర్లో ఏర్పాటు చేసిన కంటివెలుగు కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంటివెలుగు సెంటర్లలో సిబ్బంది ప్రభుత్వ ఆశయాలకనుగుణంగా పని చేయాలని సూచించారు. పరీక్షలకు వచ్చే వారికి ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టామన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పల్లం రవి, వైద్య ఆరోగ్య శాఖ, జీడబ్ల్యూఎంసీ సిబ్బంది పాల్గొన్నారు.