పోచమ్మమైదాన్, సెప్టెంబర్ 8 : ‘అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సంతృప్తి.. అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి.. అన్యాయాన్నెదిరించిన వాడే నాకారాధ్యుడు’ అని గర్వంగా ప్రకటించి ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు. తెలంగాణ కోసం, ఇక్కడి ప్రజల హక్కుల కోసం పోరాడిన మహావ్యక్తి. పుట్టుక, చావు తప్ప బతుకంతా తెలంగాణకిచ్చిన మహనీయుడు. తన భావాలను తెలంగాణ యాసలో.. సులభంగా అర్ధమయ్యే భాషలో చెప్పేవారు.
ఆనాడు తెలంగాణ భాష అణచివేతకు వ్యతిరేకంగా గళం విప్పి, కలం ఎత్తిన కాళోజీ గురించి తెలియని వారుండరు. తెలంగాణ, స్వాతంత్య్ర ఉద్యమాల్లో చురుకుగా పాల్గొని అందరికీ ఆదర్శంగా నిలిచారు. తెలంగాణ ప్రభుత్వం కాళోజీ జయంతి అయిన సెప్టెంబర్ 9ని తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించడమే కాకుండా యేటా ఆయన పేరిట సాహితీ పురస్కారాలను అందిస్తూ గౌరవిస్తున్నది. కాగా, కాళోజీ నారాయణరావు 1914లో కర్నాటక రా్రష్ట్రం బీజాపూర్ జిల్లాలోని రట్టిహళ్లి గ్రామంలో జన్మించారు.
కాళోజీ తల్లి రామబాయమ్మ కర్నాటక, తండ్రి రంగారావు మహారాష్ట్రకు చెందినవారు. కాళోజీ కన్నడ, హిందీ, ఉర్దూ, మరాఠీ, ఇంగ్లిషు భాషల్లో అనేక రచనలు చేసి ప్రజలను చైతన్యపరిచారు. తర్వాత బీజాపూర్ నుంచి వరంగల్‌లోని మడికొండకు వచ్చి స్థిరపడ్డారు. 1930 నుంచే కాళోజీ గ్రంథాలయోద్యమంగా చురుకుగా పాల్గొనేవాడు. తెలంగాణలోని ప్రతిగ్రామంలో ఒక లైబ్రరీ ఉండాలన్నది ఆయన ఆకాంక్ష. సత్యాగ్రహంలో పాల్గొని 25 ఏళ్ల వయసులోనే జైలుకు వెళ్లి వచ్చారు. కాళోజీ ఎవరికీ జంకకుండా తన రచనలు చేస్తూ, నిర్మొహమాటంగా చెప్పేవారు. ముఖ్యంగా కాళోజీ రాసిన ‘నా గొడవ‘ సామాజిక సమస్యలపై అధికారులకు, పాలకులకు సవాల్‌గా నిలిచింది.