హనుమకొండ, సెప్టెంబరు 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సాహిత్య, సాంస్కృతిక సంఘాల కార్యక్రమాలకు. కవులు, రచయితలు, కళాకారులకు అడ్డాగా నిలవాల్సిన కాళోజీ కళాక్షేత్రం కాంగ్రెస్ సర్కారు తీరుతో ఈ వర్గాలకు దూరమవుతున్నది. ప్రాచీన కాలం నుంచి వరంగల్‌కు ప్రత్యేక గుర్తింపుగా నిలిచిన సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఉపయోగపడలేకపోతున్నది. రోజువారీ కార్యక్రమాలు, కవులు, కళాకారులు, రచయితల సమ్మేళనాలు నిర్వహించుకోలేని దుస్థితి నెలకొంది. కనీసం అర లక్ష ఉంటేనే క్షేత్రాన్ని అద్దెకు తీసుకొని కార్యక్రమాలు నిర్వహించుకునే పరిస్థితి వచ్చింది.
కేసీఆర్ ప్రతిపాదించిన భవన నిర్మాణంలో కళాకారులు, ప్రదర్శనల కోసం మినీ హాల్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఉన్నది. నిర్మాణ పనులు చివరి దశలో ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం దీనిని మార్చివేశారు. దీంతో ఇప్పుడు వరంగల్ ఉమ్మడి జిల్లాలోని కవులు, కళాకారుల కార్యక్రమాలకు వేదిక లేకుండా పోయింది. కళాక్షేత్రంలో కవులు, రచయితలకే ప్రవేశం లేకుండా చేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నతాధికారులు కళాక్షేత్రం ప్రధాన ఉద్దేశాన్ని ప్రభుత్వానికి వివరించి ఇప్పటికైనా మినీహాల్ నిర్మాణం పూర్తి చేయాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాలను పెద్ద హాల్లో నిర్వహించలేమని, నిరంతరం జరిగే కార్యక్రమాల కోసం రవీంద్రభారతి తరహాలోనే కళాక్షేత్రంలో తప్పనిసరిగా మినీ హాలు ఏర్పాటు చేయాలని కవులు, రచయితలు, కళాకారులు కోరుతున్నారు.
రవీంద్రభారతి తర్వాత వరంగల్‌లో ఏర్పాటు చేసిన కాళోజీ కళాక్షేత్రం సాహిత్యకారులను వెక్కిరించే విధంగా ఉంది. కాళోజీ పేరుమీద నిర్మించిన భవనం కాళోజీ శిష్యులకు ఉపయోగపడకపోవడం దారుణం. ప్రధానంగా ఆడిటోరియం ఇరువైపులా ఉన్న గదులను మార్పు చేసి, 150 నుంచి 200 కెపాసిటీతో మినీహాల్‌ను నిర్మించి కవులు, రచయితలకు ఉచితంగా ఇవ్వాలి. అయితే ఈ గదులను వేరే కార్యాలయాలకు కేటాయించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తున్నది. ఆ ఆలోచనను వెంటనే విరమించుకోవాలి.
– మారేడుగొండ బ్రహ్మచారి (నిధి), ప్రముఖ కవి
నగరంలోని కళా సంస్థలు, కళా వేదికలకు ఉపయోగపడాల్సిన కాళోజీ కళాక్షేత్రం ధనవంతులకే అందుబాటులో ఉంది. రూ. లక్షలు ఖర్చు పెట్టి ఏ కళాకారుడు కళాక్షేత్రాన్ని అద్దెకు తీసుకోడు. నామమాత్రపు ఫీజు లేకపోవడంతో కళాకారులు ప్రదర్శనలు చేయడానికి సాహసించడం లేదు. తక్కువ మందితో నిర్వహించే కార్యక్రమాలకు కరెంట్, ఏసీ తదితర బిల్లులు ఎలా చెల్లిస్తారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో రూ.15,000 మాత్రమే అద్దె తీసుకుంటారు. ఇక్కడ ఆ పద్ధతి లేకపోవడం వల్ల కళాకారులకు ఉపయోగపడే పరిస్థితి లేదు.
– సీతాల రాఘవేందర్, ప్రముఖ కళాకారుడు
కాళోజీ కళాక్షేత్రం డబ్బున్న వాళ్ల వ్యాపార కార్యక్రమాలకు ఉపయోగపడేలా నిర్వాహణ ఉండడం అన్యాయం. కవులు, రయితలు సమావేశాలు జరుపుకోవడానికి వీలుగా మినీ హాల్ నిర్మించి ఉచితంగా అందుబాటులోకి తీసుకురావాలి. హైదరాబాద్ రవీంద్రభారతిలోని మొదటి అంతస్తులో ఉన్న హాల్‌ను కవులు, రచయితల సమావేశాలకు ఉచితంగా ఇస్తారు. ఇక్కడ మినీ హాల్ నిర్మించి మాకు అందజేయాలి. ప్రస్తుతం కళాక్షేత్రం కవులు, రచయితలకు అందుబాటులోకి వస్తుందని ఆశిస్తే మాకు నిరాశే మిగిలింది
– డాక్టర్ బండారు సుజాత, ప్రముఖ రచయిత్రి
ప్రజాకవి కాళోజీ పేరుతో నిర్మించిన కళాక్షేత్రంలో కవులు, రచయితల సాహిత్య సమావేశాలు, పుస్తకావిష్కరణ, పరిచయ సభలు ఏర్పాటు చేసుకోవడానికి సరైన వేదిక లేదు. 1500 మంది కెపాసిటీతో విశాలంగా ఉండడంతో చిన్న కార్యక్రమాలు నిర్వహించలేకపోతున్నాం. కళాక్షేత్రం రెండో అంతస్తులో రవీంద్రభారతి మాదిరిగా 200 కెపాసిటీతో ప్రత్యేక వేదికను అందుబాటులోకి తీసుకురావాలి. అలాగే దీనిని కమర్షియల్ దృష్టితో చూడకుండా ఒక కమిటీని ఏర్పాటు చేసి, నామమాత్రపు ఫీజుతో సామాన్యుడికి అందుబాటులో ఉంచాలి.
– బిల్ల మహేందర్, ప్రముఖ రచయిత