వారసత్వ, చారిత్రక, సాంస్కృతిక రంగాల్లో ఓరుగల్లుకు ఉన్న గుర్తింపును మరింత పెంచేలా గత కేసీఆర్ ప్రభుత్వం రూ. 85.10 కోట్లతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళోజీ కళా క్షేత్రం ప్రస్తుతం కళ తప్పింది. సీఎం రేవంత్‌రెడ్డి నవంబర్ 19న అట్టహాసంగా కళా నిలయాన్ని ప్రారంభించగా, ఆ తర్వాత రోజు నుంచే మూసివేయడంతో పడావుగా ఉంటున్నది. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(కుడా) పరిధిలో ఈ కేంద్రం నిర్వహణ ఉండగా, సాహి త్య, సాంస్కృతిక, నాటక కార్యక్రమాలకు కేటాయించాలని కోరినా వారి నుంచి స్పందన కరువైంది. ఏ స్ఫూర్తితో దీన్ని నిర్మించారో అది నెరవేరకపోవడంపై కళాకారుల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతున్నది.
– వరంగల్, జనవరి 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
చారిత్రక వరంగల్ నగరాన్ని సాంస్కృతిక, సాహిత్య, నాటక రంగాల కార్యక్రమాలకు కేంద్రంగా నిలిపేందుకు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళోజీ కళా క్షేత్రం కళా విహీనంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించిన వెంటనే మూసివేసి రెండు నెలలవుతున్నా ఇప్పటికీ మళ్లీ తెరువలేదు. సాహిత్య, సాంస్కృతిక, నాటక కార్యక్రమాలకు కేటాయించాలని కోరినా కుడా అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదు.
అందులో ఏ కార్యక్రమాలను నిర్వహించాలనేది, ఎంత మొత్తం చెల్లించాలనేది ఇప్పటికీ స్పష్టత లేదు. కాళోజీ కళా క్షేత్రం నిర్మించిన స్ఫూర్తి నెరవేరకపోవడంతో కవులు, కళాకారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కళా నిలయాన్ని కనీసం వినియోగించే స్థితిలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ తీసుకోవడంలేదని విమర్శిస్తున్నారు. రాష్ట్రంలోనే అతి పెద్ద కళా క్షేత్రం ఇలా పడావుగా ఉండడం సరికాదని అంటున్నారు. మరో వారం వర కు వేచి చూసి నిరసన తెలియజేస్తామని హెచ్చరిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తపించి, పోరాడిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు శతజయంతి ఉత్సవాలు 2014 సెప్టెంబరు 9న మొదలయ్యాయి. ఆయన జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించిన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అదే రోజు కాళోజీ కళా క్షేత్రం భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. 4.25 ఎకరాల్లో 1.39 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో నాలుగు అంతస్తులతో నిర్మించారు. 1500 సీటింగ్ సామర్థ్యం తో ఆడిటోరియం, మీటింగ్ హాల్, డైనింగ్ హాల్స్, వీఐపీ సూట్స్‌ను అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించారు.
కార్యక్రమాల నిర్వహణకు అనుగుణం గా గ్రౌండ్ ఫ్లోర్లో రెండు మేకప్ రూ ములు ఉన్నాయి. ఆర్ట్ గ్యాలరీ, దీన్ని కూర్చుని చూడడానికి వీలుగా ఫ్రీ పంక్ష న్ లాబీని ఏర్పాటు చేశారు. సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాలుగు హై కెపాసిటీ లిఫ్ట్‌లను బిగించా రు. రూ.85.10 కోట్లతో భవన నిర్మా ణం పూర్తయ్యింది. భవనం నిర్మాణం పూర్తయిన తర్వాత 2023 అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ప్రారంభోత్సవం వాయిదా పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 11 నెలల తర్వాత… నవంబర్ 19న ముఖ్యమం త్రి రేవంత్‌రెడ్డి కళా క్షేత్రాన్ని ప్రారంభించారు. ఆ ఒక్క రోజు తప్ప ఎప్పుడూ తెరుచుకోలేదు.