జయశంకర్ భూపాలపల్లి, మే 22 (నమస్తే తెలంగాణ)/మహాదేవపూర్ : సరస్వతీ పుష్కరాల సందర్భంగా కాళేశ్వరంలోని త్రివేణి సంగమం గురువారం జనసంద్రంగా మారింది. ఎనిమిదో రోజు భక్తులు పోటెత్తారు. బుధవారం రాత్రి కురిసిన వర్షానికి పరిసరాలు బురదమయం కాగా భక్తులు ఇబ్బంది పడ్డారు. బస్టాండ్ నుంచి పుష్కరఘాట్ వరకు దారిలో పూర్తిగా బురద పేరుకుపోయి, అందులో లారీ చిక్కుకుపోయింది. దీంతో పుష్కరఘాట్ వరకు భక్తులను తీసుకొని వెళ్లే ఉచిత వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
ఎస్పీ కిరణ్ కరె, కలెక్టర్ రాహుల్ శర్మ ప్రత్యేక దృష్టి సారించి దారి వెంట స్టోన్‌డస్ట్‌తో మరమ్మతు చేయించి రాకపోకలను పునరుద్ధరించారు. కాళేశ్వర ముక్తీశ్వర ఆలయంలో వీఐపీ, ప్రత్యేక దర్శనాలు బంద్ చేసి రెండు క్యూ లైన్ల ద్వారా సమానంగా భక్తులను దర్శనానికి పంపారు. రద్దీ కారణంగా క్యూలో భక్తులు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది.
ఈ క్రమంలో పలువురు వృద్ధులు, చిన్నారులు సొమ్మసిల్లి పడిపోయారు. ఇదిలా ఉండగా కాళేశ్వరానికి వచ్చే వాహనాలకు వన్ వే చేయడంతో ట్రాఫిక్ సమస్యలు తగ్గాయి. ఎస్పీ, కలెక్టర్ కమాండ్ కంట్రోల్ రూం నుంచి సీసీ కెమెరాల ద్వారా ట్రాఫిక్‌ను పర్యవేక్షిస్తూ అధికారులు సిబ్బందికి సూచనలు చేశారు. వర్షంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగగా, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ మల్చూర్ ఆధ్వర్యంలో సిబ్బంది ఎప్పటికప్పుడు మరమ్మతు పనులు చేపట్టారు. పుషరాల ముగింపునకు నాలుగు రోజులు సమయం ఉన్నందున భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండడంతో అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది.
ప్రముఖుల రాక
సరస్వతీ పుష్కరాలకు ప్రముఖుల తాకిడి కొనసాగుతూ ఉంది. గురువారం మంథిని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు, ఎంపీ, బీజేపీ నేత ఈటల రాజేందర్, తెలంగాణ హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ, సినీ నటుడు అల్లు అర్జున్ తల్లి నిర్మల, నిజామాబాద్ ఎమ్మెల్యే సత్యనారాయణ తదితరులు హాజరై పుణ్యస్నానాలు ఆచరించి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
సిగ్నల్స్ నిల్.. వ్యాపారాలు డల్
కాళేశ్వరంలో పుష్కరాల ప్రారంభం నుంచి సెల్ సిగ్నల్స్ సరిగ్గా లేక భక్తులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పుష్కరాలను నమ్ముకొని వ్యాపారాలు పెట్టుకున్న వ్యాపారులు యూపీఐ చెల్లింపులు జరగక ఆర్థికంగా నష్టపోతున్నారు. అధిక శాతం భక్తులు నగదు రహిత లావాదేవీల వైపే మొగ్గు చూపడంతో వ్యాపారాలు డల్‌గా సాగుతున్నాయి.
ఈ నాలుగు రోజులే కీలకం
కాళేశ్వరం పుషరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తగిన ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ అన్నారు. గురువారం ఆమె కాళేశ్వరంలో ఏర్పాటు చేసిన సౌకర్యాలు, వసతులపై కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరేతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ నాలుగు రోజులే కీలకమని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
దర్శనానికి గంటల సమయం పడుతున్నది
కాళేశ్వర ముక్తీశ్వర క్షేత్రంలో భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు లేవు. స్వామి వారి దర్శనానికి గంట ల కొద్దీ సమయం పడుతున్నది. క్యూ లో నిలబడలేక చాలా ఇబ్బంది పడాల్సి వస్తున్నది. పోలీసులు, ఆల య సిబ్బంది వీఐపీల దర్శనాల కోసం ఆరాటపడుతున్నారు.సామాన్య భక్తులను పట్టించుకోవడం లేదు.
– చంద్రకళ, మంచిర్యాల
వాకీటాకీలతో కాంగ్రెస్ సైన్యం
మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు
సరస్వతీ పుష్కరాల్లో కాంగ్రెసోళ్లకు, ప్రైవేటు సైన్యానికి మంత్రి శ్రీధర్‌బాబు జోకర్ తమ్ముడు వాకీటాకీలు ఇచ్చి ప్రైవేటు దర్శనాలు చేయిస్తున్నాడని మంథిని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆరోపించారు. పుష్కరాల్లో విధులు నిర్వర్తిస్తున్న పారిశుధ్య కార్మికుడు చనిపోతే ఇంతవరకు అతడి కుటుంబానికి మంత్రి శ్రీధర్‌బాబు రూపా యి ఇవ్వలేదని, ఎస్సీ, బీసీల చావులంటే ఇంత చులకనా అని ప్రశ్నించారు. కొరవడిన సౌకర్యాలు, పనిభారంతో కార్మికుడు శ్రీనివాస్ చనిపోయాడని, ఈ విషయంపై మంత్రి శ్రీధర్‌బాబు, దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్పై ఎందుకు కేసు పెట్టరాదో చెప్పాలన్నారు.
మృతుడి కుటుంబానికి రూ. 50లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశా రు. దక్షిణకాశీగా పేరొందిన కాళేశ్వర క్షేత్రానికి ఎంతో చరిత్ర ఉంద ని, మంత్రి శ్రీధర్‌బాబు దంపతుల తీరుతో ఆలయ ప్రతిష్టకు చెడ్డపేరు వస్తున్నదన్నారు. ప్రొటోకాల్ ఉల్లంఘించి దళిత కులానికి చెందిన ఎంపీని అవమానపరిచారని, దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇందుకు బాధ్యత వహించాలని, ఈ విషయాన్ని తాము వదిలిపెట్టమన్నారు.