పర్యవేక్షణ లేదు.. పరిశుభ్రత లేదు.. భోజనంలో నాణ్యత అసలే లేదు. ఇదీ కేయూ హాస్టళ్ల దుస్థితి. ఇక కామన్మెస్లో ఎక్కడచూసినా పరిసరాలన్నీ చెత్త, దుర్గంధం, పాకురు పట్టడం, మరుగుదొడ్లు కంపుకొడుతుండడంతో ముక్కు మూసుకోవాల్సి వస్తున్నది. వర్సిటీ అధికారుల పట్టింపులేని తనం, కేర్‌టేకర్ ఇష్టారాజ్యం వల్ల విద్యార్థులు సరిపడా టిఫిన్, భోజనానికీ నోచుకోక తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తున్నది.
– హనుమకొండ చౌరస్తా, మార్చి 22
కాకతీయ యూనివర్సిటీ హాస్టళ్లలో సమస్యలు తిష్ట వేశాయి. అడుగడునా అసౌకర్యాలు విద్యార్థులను వెక్కిరిస్తున్నాయి. సుదూర ప్రాంతాల నుంచి వచ్చి హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులకు నాణ్యమైన భోజనం కరువైంది. వెయ్యి మంది విద్యార్థులకు ఉపయోగపడే కామన్మెస్లో నాణ్యత లోపించడంతో విద్యార్థులు ఆందోళనకు దిగాల్సిన పరిస్థితి దాపురించింది. కామన్మెస్ భోజనంలో నాణ్యత లేదని, పురుగులు, ప్లాస్టిక్ కవర్లు వస్తున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
హాస్టళ్లలో ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు, స్విచ్‌బోర్డుల సమస్యతోపాటు మరుగుదొడ్లు అపరిశుభ్రంగా, విద్యార్థులు వాడుకోలేని స్థితిలో ఉన్నాయి. వరర్స్ సరిపడా లేనందున విద్యార్థులకు ఉదయం టిఫిన్ అందించలేకపోతున్నారు. చాలామంది విద్యార్థులు ఆ పూటకి పస్తులు ఉంటున్నారు. విద్యార్థులకు సరిపడా భోజనం అందడంలేదు. బాత్రూమ్ల్లో వాటర్ లీకేజ్ వల్ల వస్తున్న మురికినీరు అక్కడక్కడా నిల్వ ఉండి దుర్వాసన వెదజల్లుతున్నది. విపరీతమైన దోమలతో రోగాలబారిన పడుతున్నామని, టాయిలెట్స్ అపరిశుభ్రంగా ఉండి గదుల్లోకి దుర్వాసన వస్తున్నదని విద్యార్థులు వాపోతున్నారు.
తాము అనారోగ్యానికి గురవుతున్నా అధికారుల తీరు మారడం లేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీళ్ల ట్యాంకును సైతం శుభ్రం చేయకపోవడంతో పాకురు పట్టిపోయిందన్నారు. ఇక హాస్టళ్లలో ఉండాల్సిన కేర్టేకర్లు అలా వచ్చి ఇలా వెళ్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. కేర్టేకర్లు అందుబాటులో ఉండడంలేదని, వీసీ, హాస్టల్ డైరెక్టర్ నిర్లక్ష్యంతో తాము ఇబ్బందిపడుతున్నామన్నారు. ఇటీవల స్కాలర్స్ హాస్టల్ రిఫ్రిజిరేటర్లో బల్లిపడిన నీళ్లు తాగడంతో పరిశోధక విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హాస్టళ్లలోని కొన్ని గదుల్లో బెడ్స్ ఉన్నాయని, మరికొన్ని గదుల్లో మొత్తానికి లేకపోవడంతో నేలపైనే పడుకుంటున్నామన్నారు.
కామన్‌మెస్‌ను ఓ క్యాజువల్ లేబర్ శాసిస్తున్నాడని పలువురు విద్యార్థులు అతడి తీరుపై మండిపడుతున్నారు. హాస్టల్లో అతను చెప్పిందే వేదం అన్నట్లుగా అంతా అతడి కనుసన్నల్లోనే నడుస్తున్నట్లు సమాచారం. ‘ప్రభుత్వం మాదే, వీసీ మావోడే’ అన్నట్లు వ్యవహరిస్తున్నారని, అందరూ బదిలీపై వెళ్లగా అతను మాత్రం అందులోనే తిష్టవేసి కామన్‌మెస్‌ను ఏలుతున్నట్లు ఆరోపణలు లేకపోలేదు. అతడి తీరుపై వర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడంలేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.