హనుమకొండ చౌరస్తా : కాకతీయ విశ్వవిద్యాలయానికి (Kakatiya University ) రూ. 1,000 కోట్లు మంజూరు చేయాలని ఏబీవీపీ ( ABVP ) యూనివర్సిటీ అధ్యక్షులు ఉబ్బటి హరికృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యూనివర్సిటీ రెండో గేటు వద్ద గురువారం విద్యార్థులు నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ కేంద్రమైన ఉస్మానియా విశ్వవిద్యాలయానికి 1000 కోట్లు మంజూరు చేసినట్లుగానే కాకతీయ విశ్వవిద్యాలయానికి మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కాకతీయ విశ్వవిద్యాలయంలో కనీస వసతులు కూడా లేవని వివరించారు. ఇక్కడ చదివే విద్యార్థులు అందరూ కూడా గ్రామీణప్రాంత ఎస్సీ, ఎస్టీ, బీసీ బడుగు బలహీన వర్గాల బిడ్డలని తెలిపారు.
ఎన్నో ఆశలతో కేయూకు వస్తే కనీసం ఇక్కడ సదుపాయాలు కూడా అందుబాటులో లేవని వాపోయారు. కాకతీయ యూనివర్సిటీలో ఉన్న మహిళా ఇంజనీరింగ్ కాలేజీకి కనీసం వసతిగృహం కూడా లేకపోవడం బాధాకరమని అన్నారు. 470 రెగ్యులర్ పోస్టులు భర్తీ చేయకుండా, ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచడంతో విద్యార్థులందరూ ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాకతీయ విశ్వవిద్యాలయాన్ని సందర్శించి ఇక్కడ ఉన్న విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీ కార్యదర్శి మేకల జ్ఞానేశ్వర్, ఉపాధ్యక్షుడు ఫణీంద్ర, ఉమేష్, మధు, రవితేజ, మల్లేష్ విద్యార్థులు పాల్గొన్నారు.