హనుమకొండ చౌరస్తా, మే 2 : ప్రజల జీవనంలో పరివర్తన ఇంజినీరింగ్ వల్లే సాధ్యమని కవి, గాయకుడు, శాసన మండలి సభ్యుడు దేశపతి శ్రీనివాస్ అన్నారు. కేయూ ఆడిటోరియంలో విశ్వవిద్యాలయ ఇంజినీరింగ్ కాలేజీ(కో-ఎడ్యుకేషన్) ప్రిన్సిపాల్ మల్లారెడ్డి అధ్యక్షతన ‘వార్షిక-స్పోర్ట్స్ డే’ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు, యువతపై సమాజం ఎన్నో ఆశలు పెట్టుకుందన్నారు. విశ్వవిద్యాలయం అంటే ప్రేరణ అని, కాకతీయ, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల పోరాటాల ఫలితమే తెలంగాణ అన్నారు. అలీ నవాబ్ జంగ్ బహదూర్ గొప్ప ఇంజినీర్ అని గుర్తు చేశారు. మార్పు కోసం తప్ప మారుల కోసం చదువు సాగొద్దని సూచించారు. అవినీతికి దూరంగా ఉండాలని, చదువులో మానవీయకోణం ఉండాలన్నారు.
భారత రాజ్యాంగ నిర్మాత అంబేదర్ను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. వీసీ తాటికొండ రమేశ్ మాట్లాడుతూ చదువు సామాజిక బాధ్యత అని అన్నారు. ఇంజినీరింగ్ విద్యార్థులు కేవలం వారి పుస్తకాలకే పరిమితం కావద్దని, ఇతర కళలపై కూడా అవగాహన, మకువ పెంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. యువత సమాజం గురించి కూడా ఆలోచించాలన్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ప్రతి విషయం నమ్మదగినది కాదని చెప్పారు. అంతకుముందు కేయూ ఆడిటోరియంలో దేశపతి శ్రీనివాస్ తన పాట, మాటలతో విద్యార్థుల్లో ఉత్తేజం నింపారు. అలాగే, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం వివిధ పోటీల్లో విజేతలకు ఎమ్మెల్సీ దేశపతి, వీసీ రమేశ్ బహుమతులు, మెడల్స్ అందజేశారు. కార్యక్రమంలో డాక్టర్ మహేందర్ తదితరులు పాల్గొన్నారు.