ములుగు, మే 14 (నమస్తే తెలంగాణ) : ములుగు జిల్లా కేంద్రంతో పాటు మండలం చుట్టూ కాకతీయుల కట్టడాల ఆనవాళ్లు దర్శనమిస్తున్నాయి. లోకం చెరువు వద్ద గిరిజన యూనివర్సిటీ ప్రహరీ నిర్మాణం కోసం కందకాలు తీస్తుండగా గుడికి సంబంధించిన బండరాళ్లు బయట పడగా ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ విషయం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఆ ప్రాంతంలో అద్భుతమైన గుడి ఉండేదని, అక్కడ ప్రజలు నిత్యం పూజలు చేసేవారని 80 నుంచి 90 ఏళ్ళు పైబడిన వృద్ధులు చెబుతున్నారు. లోకం చెరువు కట్ట చాలా ఏండ్ల క్రితం తెగిపోగా నీటి ప్రవాహానికి దిగువన ఉన్న ఈ గుడి కూలిపోయి కాలగర్భంలో కలిసిపోయిందని, దానిని ఎవరు పట్టించుకోలేదంటున్నారు.
కొందరు హనుమాండ్ల గుడి అంటుండగా మరికొందరు తటాకాంజనేయ స్వామి ఆలయమని, దానిని కాకతీయులే నిర్మించారని చెబుతున్నారు. అయితే చరిత్రకారులు మాత్రం కాకతీయులు ఎక్కడ చెరువులు తవ్వించినా అక్కడ వారి ఇష్టదైవమైన శివాలయాన్ని నిర్మించే వారని చెబుతున్నారు. అది శివాలయమని చెప్పడానికి తవ్వకాల సమయంలో దర్శనమిచ్చిన నాగు పాములే సాక్ష్యమని, ఆంజనేయ స్వామి ఆలయం వద్ద పాములు అవి ఉండవంటున్నారు. అయితే బయట పడిన ఓ భారీ రాయిపై జోడు నాగు పాముల రూపం చెక్కి ఉన్నట్లు తెలిసింది. తవ్వకాలు చేపట్టిన జేసీబీ డ్రైవర్‌కు మరుసటి రోజు నుంచి తీవ్ర జ్వరం రాగా, ఇటీవల కోలుకున్నట్లు తెలిసింది.
ములుగులోని గొల్లవాడ శ్రీక్షేత్రం వద్ద కాకతీయుల నాటి రాతి స్తంభాలు, నగరేశ్వరస్వామి ఆలయంలో నంది, వినాయక విగ్రహాలు, తామెర పువ్వును పోలిన పైకప్పు ఉన్నాయి. అలాగే చిన్నగుంటూరుపల్లిలో రామప్పలోని నందీశ్వరుడిని పోలిన చిన్నపాటి విగ్రహం, పత్తిపల్లి సమీపంలోని బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవస్థానం వద్ద శివలింగం ఉన్నాయి. కాగా, కాలగర్భంలో కలిసిన గుడికి సంబంధించిన ఆనవాళ్లు బయటకు రావడం, గుడి పునాది రాళ్లు దర్శనమివ్వడం, ఆచోటే కోనేరును తలపించేలా ఆకుపచ్చని నీరు ఐదు ఫీట్ల వరకు ఉబికి రావడం విశేషం. అయితే ఈ ప్రాంతంలో కచ్చితంగా శివాలయం ఉంటుందని, పురావస్తు శాఖ అధికారులు తవ్వకాలు చేపట్టాలని ములుగు ప్రజలు కోరుతున్నారు.