వరంగల్ చౌరస్తా, అక్టోబర్24: నేటి నుంచి కేఎంసీలో కాకతీయ రీసెర్చ్ ఇనిషియేటివ్ ఫర్ ట్రాన్స్ఫార్మేటివ్ ఇన్నోవేషన్స్-24(క్రితి-24)ను నిర్వహించనున్నారు. గురువారం కేఎంసీ ఎన్ఆర్ఐ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాకతీయ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాంకుమార్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. పరిశోధనల ద్వారా పూర్తిస్థాయి విశ్లేషణతో విజ్ఞానాన్ని సముపార్జించే విధానాన్ని అలవాటు చేయడంతో పాటు గా దేశవ్యాప్తంగా ఉన్న వైద్యవిద్యార్థుల ఆలోచనలను పంచుకునేలా వేదికను ఏర్పాటు చేసి నట్లు పేర్కొన్నారు. ఆలుమ్ని (కేఎంసీ పూర్వ విద్యార్థుల సంఘం)తో పాటుగా యూఎస్ఏ ఆలుమ్ని విభాగం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
యూజీ, పీజీ విద్యార్థులకు 7 విభాగాలుగా కార్యక్రమాలను రూపొందించామన్నారు. శుక్రవారం డిబేట్, హాకథాన్, జెపార్డీ(క్విజ్) కార్యక్రమాలు, శనివారం పేపర్ ప్రెజెంటేషన్, పోస్టర్ ప్రె జెంటేషన్, సింపోజియం కార్యక్రమాలు ఉంటాయని అన్నారు. దేశవ్యాప్తంగా సుమారు 100 వైద్యకళాశాలల నుంచి విద్యార్థులు పాల్గొనబోతున్నారని, వెయ్యికి పైగా వచ్చిన రిజిస్ట్రేషన్లలో 350 మందిని ఎంపిక చేశామని తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు భారీ నగదు, ప్రోత్సాహక బహుమతులు సైతం అందించనున్నామని తెలిపారు. యూఎస్ఏ అలుమ్ని ప్రతినిధి డాక్టర్ సుజిత్ ఆర్ పున్నం, డాక్టర్ వేణు బత్తిని తదితరులు పాల్గొన్నారు.