గీసుగొండ, జూన్ 27 : లక్షలాది మందికి ఉద్యో గ, ఉపాధి అవకాశాలే లక్ష్యంగా 2017లో కేసీఆర్ సర్కారు వరంగల్‌లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు శ్రీకారం చుట్టింది. 1350 ఎకరాల్లో దేశంలోనే అతిపెద్ద వస్త్ర పరిశ్రమ ఏర్పాటుకు అడుగులు పడగా, మౌలిక వసతుల కల్పనకు రూ.700 కోట్లు మంజూరు చేసింది. ఇప్పటికే మూడు పరిశ్రమలు తమ కార్యకలాపాలు ప్రారంభించగా మరికొన్ని పనులు అసంపూర్తిగా ఉన్నాయి. ఈక్రమంలో ఇటీవల రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన పార్కుపై దృష్టిపెట్టాల్సిన అవసరముంది. పార్కు నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంత నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని స్థానికులు భావిస్తున్నారు. శనివారం పార్కును సీఎం రేవంత్‌రెడ్డి సందర్శించనున్న నేపథ్యంలో నిలిచిన పనులను పూర్తి చేయడంతో పాటు పరిశ్రమలకు భరోసా కల్పించాలని వారు కోరుతున్నారు.
వరంగల్ జిల్లా గీసుకొండ మండలం శాయంపేటలో ఏర్పాటుచేసిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ మణిహారంగా నిలిచింది. 2017లో అప్పటి ముఖ్యమ్రంతి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కృషితో 1350 ఎకరాల్లో దేశంలోనే అతిపెద్ద వస్త్ర పరిశ్రమ ఏర్పాటుకు అడుగులు పడ్డాయి. లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ పార్కుకు శంకుస్థాపన చేయగా, అదే రోజు వివిధ దేశాలు, రాష్ర్టాల వస్త్ర పరిశ్రమలతో ఎంవో యూ చేసుకున్నారు. అందులో మూడు పరిశ్రమలు తమ నిర్మాణాలు ప్రారంభించి పూర్తిచేసుకున్నాయి. కొవిడ్ కారణంగా కొన్ని పరిశ్రమలు రాలేకపోయాయి. పార్కులో మౌలిక వసతుల కల్పన కోసం కేసీఆర్ ప్రభుత్వం రూ.700 కోట్లు కేటాయించింది. ఆ నిధులతో భూసేకరణ, రోడ్ల నిర్మాణాలు, సైడ్డ్రైన్స్, విద్యుత్, నీటి సౌకర్యం, సెంట్రల్ లైటింగ్, అండర్ బ్రిడ్జిలు, సేకరించిన భూమి చుట్టూ ప్రహరీ నిర్మాణాలు చేపట్టగా అందులో కొన్ని పూర్తికాగా మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. గత ప్రభుత్వం పార్కుపై ప్రత్యేక దృష్టి సారించగా, అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అనునిత్యం సమీక్షలు చేస్తూ ఇతర రాష్ర్టాల్లోని పరిశ్రమలను ఒప్పించి ఇక్కడికి వచ్చేలా చేశారు. పార్కు కోసం సేకరించిన భూమిలో 1200 ఎకరాలను వివిధ పరిశ్రమలకు కేటాయించారు.
మిగతా 46 ఎకరాల స్థలాన్ని పార్కుకోసం భూములిచ్చిన రైతులకు ప్లాట్లు చేసి ఇచ్చేందుకు సిద్ధం చేశారు. మరో 56 ఎకరాల భూ మిని చేనేత, వస్త్ర పరిశ్రమలకు 750 గజాల చొప్పు న ఇచ్చేందుకు లేఅవుట్ చేశారు. మిగతా భూమిని పరిశ్రమల సామాజిక అవసరాల కోసం కేటాయించారు. పార్కులో ఇప్పటికే గణేషా ఎకోటెక్ ప్రైవేట్ లిమిటెడ్‌కు 50 ఎకరాలు కేటాయించగా, రూ.500 కోట్ల పెట్టుబడితో నిర్మాణాన్ని పూర్తి చేసుకుంది. గతేడాది అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఉత్పత్తిని ప్రారంభించి కొనసాగిస్తున్నది. ఈ పరిశ్రమలో 600మంది పనిచేస్తున్నారు. కిటెక్స్ పరిశ్రమ 191 ఎకరాల్లో రూ.1500 కోట్ల పెట్టుబడితో నిర్మాణం ప్రారంభించి 80 శాతం పనులను పూర్తి చేసుకొని త్వరలో ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఇందులో 13వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. దక్షిణ కొరియాకు చెందిన యంగ్వన్ పరిశ్రమకు 297 ఎకరాల భూమిని కేటాయించా రు. రూ.1000 కోట్ల పెట్టుబడితో ఈ పరిశ్ర మ తన నిర్మాణాలను పూర్తి చేసుకుంటున్నది. ఇప్పటికే ఒక షెడ్ నిర్మాణం పూర్తి చేసిన యాజమాన్యం అందులో పనిచేసేందుకు 7వేల మంది మ హిళలకు శిక్షణ ఇస్తున్నది. పార్కుకు ఎగుమతులు, దిగుమతుల కోసం చింతలపల్లి వద్ద రైల్వే ట్రాక్‌ను ఏర్పాటు చేశారు. గత బీజేపీ ప్రభుత్వం పీఎం మిత్రలో ఈ టెక్స్టైల్ పార్కుకు చోటు కల్పించింది. దీంతో అప్పటి, ఇప్పటి కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం పార్కులో అభివృద్ధికి రూ.200 కోట్లు మంజూరు చేసినట్లు టీజీఎస్ఐఐసీ జోనల్ మేనేజర్ సంతోష్‌కుమార్ తెలిపారు.