‘తలాపున గోదారి.. మన భూములు ఎడారి..’ సమైక్యపాలనలో తెలంగాణ ప్రాజెక్టులపై కొనసాగిన వివక్షకు ‘అక్షరాలా..’ ఓ కవి ఆవేదన ఇది! కానీ పోరాడి సాధించుకున్న తెలంగాణను గోదావరి జలాలతో తడపాలని సంకల్పించిన రాష్ట్ర ప్రభుత్వం, ఆ మేరకు విజయం సాధించింది. కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టుల ద్వారా కరువు నేలలను సైతం మాగాణంలా మార్చింది. మరోవైపు పొలాలకు జలాలను తరలించే కాలువల మరమ్మతులను చేయించింది. దీంతో ఉమ్మడి జిల్లాలో ప్రతి ఎకరాకు సాగు నీరు పుష్కలంగా అందుతుండడంతో గతంతో పోలిస్తే సాగువిస్తీర్ణం గణనీయంగా పెరిగింది.
– వరంగల్,జూన్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/జనగామ, (నమస్తే తెలంగాణ)
వరంగల్, జూన్ 6(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/జనగామ, (నమస్తే తెలంగాణ) :‘మన నీళ్లు మనకే నినాదం’ సాకరమైంది. బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రణాళికతో ఎక్కడ చూసినా నీళ్లే కనబడుతున్నయి. తాగేందుకు నీళ్లు లేని పరిస్థితి నుంచి నడి ఎండాకాలంలోనూ ఎక్కడ చూసినా నీళ్లే అనేలా మారింది. తెలంగాణ రాష్ట్ర సాకారం, సీఎం కేసీఆర్ విజన్‌తో ఇది సాధ్యమైంది. అభివృద్ధిలో కీలకమైన వ్యవసాయరంగాన్ని బలోపేతం చేసే చర్యల్లో భాగంగా బీఆర్ఎస్ ప్రభుత్వం సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసి ప్రపంచానికి ఆదర్శంగా తెలంగాణ నిలిచింది. అప్పటికే ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, దేవాదుల ఎత్తిపోతల కింద ఉన్న ఆయకట్టును స్థిరీకరించడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పుడు ఏటా రెండు పంటలు సులభంగా సాగు చేసే పరిస్థితి వచ్చింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ) కింద లోయర్ మానేరు డ్యాం నుంచి వర్ధన్నపేట మండలం ఇల్లంద వరకు మొదటి దశలో 5,05,725 ఎకరాల ఆయకట్టు ఉంది. రెండో దశ పరిధిలో ఇల్లంద తర్వాత నుంచి సూర్యాపేట జిల్లా తిరుమలగిరి వరకు 3,65,000 ఎకరాల ఆయకట్టు ఉంది. రెండు దశల్లోని మొత్తం 8.70 లక్షల ఆయకట్టుకు యాసంగిలో నీటి సరఫరా అవుతున్నది. వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ పాత జిల్లాల పరిధిలో ఎస్సారెస్పీ ఆయకట్టుకు రబీలో పూర్తి స్థాయిలో సాగునీరు అందుతోంది. వరంగల్ పాత జిల్లాలో ఎస్పారెస్పీ రెండు దశల్లో కలిపి 4,72,287 ఎకరాల ఆయకట్టు ఉంది. ఏడు రోజుల విడుదల, ఏడు రోజుల నిలిపేత పద్ధతిలో నీటిని సరఫరా చేస్తున్నారు. ఎనిమిది విడుతల్లో విడుదలకు ప్రణాళిక రూపొందించారు.
ప్రతి ఎకరాకు ఏడాది పొడవునా సాగు నీరు అందించే లక్ష్యంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసింది. దేవాదుల, ఎస్సారెస్పీ ఆయకట్టును స్థిరీకరించే సమ్మక్క బరాజ్ (తుపాకులగూడెం) పనులు పూర్తయ్యాయి. 6.94 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మిస్తున్న ఈ బరాజ్ పనులు పూర్తయ్యాయి. ఈ బరాజ్‌లో 59 రేడియల్ గేట్లను అమర్చారు. రూ.1508 కోట్ల అంచనాతో పనులు పూర్తి చేశారు. తుపాలగూడెం బరాజ్ బహుళార్థ సాధక ప్రాజెక్టు. ఇక్కడ 240 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి అయ్యేలా నిర్మాణం చేపట్టారు. తుపాకులగూడెం పైన గంగారం వద్ద ఏర్పాటు చేసిన పంపులతో ఎత్తిపోతల ద్వారా దేవాదుల ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. దేవాదుల వద్ద గోదావరి నీటి మట్టం 71 మీటర్లు ఉన్నప్పుడే మోటార్లు నడుస్తాయి. వానకాలంలోనే ఈ మేరకు నీటి మట్టం ఉంటుంది. గోదావరిలో వరద ఉన్న రోజుల్లోనే పంపింగ్ ఉంటుంది. ఇలా గరిష్ఠంగా ఏడాదిలో మూడు నెలలపాటే నీటి సరఫరా ఉంటుంది. వరద తక్కువ ఉన్న సీజన్లలో ఒక్కోసారి ఖరీఫ్‌కు సైతం ఇబ్బంది అవుతుంది. ఈ పరిస్థితిని పోగొట్టి ఏడాది పొడవునా పంటలకు సాగునీరు అందించే లక్ష్యంతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం వద్ద బరాజ్‌ను నిర్మించారు. దేవాదుల పంప్ హౌస్‌కు ఐదు కిలోమీటర్ల దిగువన తుపాకులగూడెం బరాజ్‌ను 92 మీటర్ల ఎత్తుతో నిర్మించారు. దేవాదుల ప్రాజెక్టుతో ఉండే పాత వరంగల్, సిద్దిపేట, సూర్యాపేట జిల్లాల్లోని 6.21లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఎస్సారెస్పీ పరిధిలోని 7.50 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు నోచుకుంది.
ప్రతి ఎకరాకు సాగునీరు అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం జలవనరుల శాఖకు కొత్త రూపు తెచ్చింది. ప్రాజెక్టులు, కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు, పంపుహౌస్‌ల నిర్వహణ పక్కాగా ఉండేలా మార్పులు తెచ్చింది. వరంగల్ పాత జిల్లా పరిధిని వరంగల్, ములుగు చీఫ్ ఇంజినీర్ (సీఈ) సర్కిళ్లుగా ఏర్పాటు చేసింది. రెండు సర్కిళ్లలో కలిపి 13.86 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. వరంగల్ సీఈ పరిధిలో 9.64 లక్షల ఎకరాలు, ములుగు సీఈ పర్యవేక్షణలో 4.22 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. వరంగల్ సీఈ పరిధిలో వర్ధన్నపేట, స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, పరకాల, డోర్నకల్, మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలు పూర్తిగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లాలోని మండలాలు మినహా జనగామ నియోజకవర్గం వరంగల్ సీఈ పరిధిలోకి వచ్చింది. ములుగు, నర్సంపేట, భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలు ములుగు చీఫ్ ఇంజినీర్ పరిధిలోకి వచ్చాయి. మంథని అసెంబ్లీ నియోజకవర్గం పూర్తిగా రామగుండం-సీఈ పరిధిలో ఉంది. దీని పరిధిలోనే కాళేశ్వరం ప్రాజెక్టు ఉంది. ములుగు జిల్లాలోని వాజేడు, వెంకటాపురం(ఎన్) మండలాలు, మహబూబాబాద్ జిల్లాలోని గార్ల, బయ్యారం మండలాలు కొత్తగూడెం-సీఈ పరిధిలో ఉన్నాయి. రెండు చీఫ్ ఇంజినీర్ సర్కిళ్లలో కలిపి 5,466 చెరువులు, 21 పంపుహౌస్‌లు, 27 రిజర్వాయర్లు, 32 లిఫ్టులున్నాయి. సమ్మక్క బ్యారేజీ ములుగు సీఈ సర్కిల్ పరిధిలోనే ఉంది. ఎక్కువ ప్రాజెక్టుల హెడ్ రెగ్యులేటర్లు ములుగు సీఈ పరిధిలో, ఆయకట్టు వరంగల్ సీఈ పరిధిలో ఉన్నాయి. రాష్ట్రంలోనే కీలకమైన కాళేశ్వరం ప్రాజెక్టు, పలు పంపుహౌస్‌లు రామగుండం-సీఈ పర్యవేక్షణలో ఉన్నాయి.
అసెంబ్లీ నియోజకవర్గాలు : భూపాలపల్లి, ములుగు, నర్సంపేట
మొత్తం ఆయకట్టు : 4.22 లక్షల ఎకరాలు
బ్యారేజీలు : 1, పంప్ హౌస్‌లు : 8, రిజర్వాయర్లు : 10, ఐడీసీ లిఫ్టులు : 19, చెరువులు : 2,676
ఎస్సారెస్పీ కాలువ : డీబీఎం 38, 40, 46.
ఎస్సారెస్పీ ఆయకట్టు : 1.15 లక్షల ఎకరాలు
దేవాదుల ఎత్తిపోతల ఆయకట్టు : 32 వేల ఎకరాలు
రిజర్వాయర్ల ఆయకట్టు : 96 వేల ఎకరాలు
ఐడీసీ లిఫ్టుల కింద ఆయకట్టు : 10 వేల ఎకరాలు
చెరువుల కింద ఆయకట్టు : 1.69 లక్షల ఎకరాలు
రిజర్వాయర్లు : పాకాల, లక్నవరం, రామప్ప, పలిమెవాగు, గుండ్లవాగు, మొండికుంటవాగు, మల్లూరువాగు, బొగ్గులవాగు, నర్సింగాపూర్చెరువు, భీంఘన్‌పూర్.
పంపుహౌస్‌లు : దేవాదుల ఇంటేక్(3), భీంఘన్‌పూర్(3), రామప్ప(2),
బ్యారేజీలు : సమక్క బ్యారేజీ(తుపాకులగూడెం)
మొత్తం ఆయకట్టు : 9.64లక్షల ఎకరాలు
అసెంబ్లీ నియోజకవర్గాలు : జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, వర్ధన్నపేట, పాలకుర్తి, పరకాల, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, డోర్నకల్, మహబూబాబాద్
పంప్ హౌస్‌లు : 13,
రిజర్వాయర్లు : 17, ఐడీసీ లిఫ్టులు : 13, చెరువులు : 2,790
ఎస్సారెస్పీ కాలువ : 202.178 కిలో మీటర్ నుంచి 324 కిలో మీటరు వరకు
ఎస్సారెస్పీ ఆయకట్టు : 3.37 లక్షల ఎకరాలు
దేవాదుల ఎత్తిపోతల ఆయకట్టు : 4.42 లక్షల ఎకరాలు (రామప్ప పైన ఉన్న ప్రాంతం)
ఐడీసీ లిఫ్టుల కింద ఆయకట్టు : 6 వేల ఎకరాలు
చెరువుల కింద ఆయకట్టు : 1.79 లక్షల ఎకరాలు
రిజర్వాయర్లు : ధర్మసాగర్, ఆర్.ఎస్ ఘన్పూర్, అశ్వారావుపల్లి, చీటకోడూరు, గండిరామారం, బొమ్మకూరు, వెల్దండ, తపాస్‌పల్లి, నష్కల్, పాలకుర్తి, చెన్నూరు, నవాబ్‌పేట, లద్నూరు, కన్నబోయినగూడెం, మారెడ్డిచెరువు, ఐనాపూర్, మైలారం.
పంపుహౌస్‌లు : చలివాగు, పాలకుర్తి, దేవన్నపేట, ధర్మసాగర్(3), ఆర్.ఎస్.ఘన్పూర్(3), గండిరామారం(2), బొమ్మకూరు(2)
ఈ పథకం కింద 5,57,654 ఎకరాలకు గాను 2014 నాటికి 47,671 ఎకరాలకు మాత్రమే సాగు నీరు అందింది. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం రాష్ట్ర ప్రభుత్వం మొక్కవోని దీక్షతో చేపట్టిన పనుల మూలంగా ఇప్పుడు 1,53,486 ఎకరాల ఆయకట్టుకు విజయవంతంగా సాగునీరు అందుతున్నది. 2017-18లో 1,06,988 ఎకరాలు, 2018-19లో 2,93,943 ఎకరాలు, 2019-20 నుంచి మిగతా ఆయకట్టును సాగుకు సిద్ధం చేసింది.