Kranti Goud | ఐసీసీ వన్డే ప్రపంచ కప్‌లో అద్భుతంగా రాణించిన టీమిండియా క్రికెటర్ క్రాంతి గౌడ్‌కు మధ్యప్రదేశ్ ప్రభుత్వం రూ.కోటి నజరానా ప్రకటించింది. 22 ఏళ్ల యువ బౌలర్ ఎనిమిది మ్యాచుల్లో 5.73 ఎకానమీ రేటుతో బౌలింగ్ చేస్తూ తొమ్మిది వికెట్లు పడగొట్టింది. మెగా ఈవెంట్లో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చినందుకు ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ భారత జట్టుకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వరల్డ్ కప్ స్టార్ కాంతి గౌడ్‌కు రివార్డును ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో మన అమ్మాయిలు అద్భుతంగా రాణించినందుకు ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నానన్నారు.
క్రాంతి గౌడ్ మహిళల ప్రపంచ కప్ గెలిచిన జట్టులో భాగమైనందున సత్కరించాలనుకుంటున్నానని.. ప్రభుత్వం తరఫున రూ.కోటి ప్రోత్సాహకాన్ని ప్రకటిస్తున్నట్లు తెలిపారు. మ్యాచ్‌లో క్రాంతి అందించిన సహకారాన్ని ప్రశంసించారు. ఆమె ఛతర్పూర్, మధ్యప్రదేశ్‌కు గర్వకారణంగా నిలిచిందని.. భారత క్రికెటర్లు ప్రపంచవేదికపై భారతదేశం గర్వపడేలా చేశారన్నారు. కృషి, పట్టుదల, అభిరుచి ఉంటే ఏదైనా సాధించగలరన్న దానికి క్రాంతి సాధించిన విజయం ఉదాహారణ ని సీఎం యాదవ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యువ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ సరికొత్త శిఖరాలను అందుకునేందుకు అవకాశాలు, ప్రోత్సాహం అందిస్తుందన్నారు.
ఇదిలా ఉండగా.. ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసింది క్రాంతి గౌడ్. ప్రపంచకప్‌లో ఏడు వన్డేలు ఆడింది. అక్టోబర్ 5న కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో పాకిస్తాన్‌తో జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్‌లో పది ఓవర్లలో 20 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసింది. ఆ మ్యాచ్‌లో భారత జట్టు 88 పరుగుల తేడాతో గెలిచింది. అద్భుత బౌలింగ్ ప్రదర్శనకు ఆ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నది. ఇక ఇప్పటి వరకు 15 వన్డేలు ఆడిన క్రాంతి 5.79 ఎకానమీతో 23 మూడు వికెట్లు తీసింది. ఒక మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసింది. బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ 6/52. బ్యాట్‌తోనూ 682 పరుగులు చేసింది.