హనుమకొండ, నవంబర్ 3: చారిత్రక వేయిస్తంభాల రుద్రేశ్వరాలంయలో కార్తీకమాసం రెండో సోమవారం రుద్రేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ నుంచి అందించిన లక్ష తులసీ దళాలతో లక్ష తులసీ నామార్చన మహాలక్ష్మీ ప్రీతికరంగా మహాలక్ష్మీ నామాలతో శాస్త్రాన్ని అనుసరించి వందలాది మంది మహిళా భక్తురాళ్లు ఏకకంఠంతో తులసీదేవి నామస్మరణ చేస్తూ ఆ రుద్రేశ్వరునికి తులసీ దళార్చన నిర్వర్తించుకున్నారు. నీరాజన మంత్రపుష్పం అనంతరం దేవాలయాన్ని దర్శించిన వేలాది మంది భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేశారు.
సాయంత్రం దేవాదాయశాఖ ఆధ్వర్యంలో దీపాలు వెలిగించుకునే మహిళా భక్తులకు, దీపపు సామగ్రి అందజేశారు. ఆలయ నాట్యమంటపంలో గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన భజన కళాకారులు, సంగీతపరంగా స్రావ్యంగా భజన కార్యక్రమాలు నిర్వహించారు. గాయత్రి గ్రానైట్స్ అధినేత వద్దిరాజు వెంకటేశ్వరరావు దంపతులు, ట్రాఫిక్ ఏసిపి సత్యనారాయణ దంపతులు రుద్రేశ్వరస్వామికి రుద్రాభిషేకం నిర్వర్తించుకుని పూజలో పాల్గొన్నారు.
వైదిక కార్యక్రమాలను ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, ఆలయ వేద పండితులు గంగు మణికంఠశర్మ, పెండ్యాల సందీప్‌శర్మ, ప్రణవ్ నిర్వహించారు. ఆలయ సిబ్బంది ఎన్.మధుకర్, రామకృష్ణ భక్తులకు సేవలందించారు. కార్యనిర్వాహణాధికారి డి.అనిల్‌కుమార్ పూజాకార్యక్రమాలను పర్యవేక్షించారు.