ధర్మసాగర్, సెప్టెంబర్ 5 : కాంగ్రెస్ అంటేనే నమ్మక ద్రోహమని, 42 శాతం రిజర్వేషన్ల పేరుతో సీఎం రేవంత్‌రెడ్డి, అభివృద్ధి కోసమే పార్టీ మారానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రజలను మోసం చేస్తున్నారని స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ టీ రాజయ్య విమర్శించారు. ఆదివారం ఆయన ధర్మసాగర్ మండలంలోని పలు గ్రామాల్లో ‘ఊరూరికి బీఆర్ఎస్ అభివృద్ధి- ఇంటింటికీ కేసీఆర్ సంక్షేమ పథకాలు’ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వంలో పైసా పెట్టి ప్రాజెక్ట్ కట్టింది లేదు.. కానీ, అప్పులు మాత్రం భారీగా పెంచారని అన్నారు. రేవంత్‌రెడ్డి పాలనలో కన్స్ట్రక్షన్స్ లేవు.. డిస్ట్రాక్షన్స్ మాత్రమే ఉన్నాయని ఎద్దేవా చేశారు. బడా భూసాముల వద్ద కమీషన్లు తీసుకొని హైడ్రా పేరుతో పేదల ఇండ్లను మాత్రమే కూల్చివేశారని అన్నారు. 42శాతం రిజర్వేషన్లపై పార్టీ నేతలే తిట్టుకునే పరిస్థితి ఉందన్నారు.
రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లకు బిల్లులు చెల్లించే పరిస్థితి లేదని, బిల్లుల కోసం లబ్ధిదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారన్నారు. అభివృద్ధి కోసమే పార్టీ మారినట్లు గోబెల్స్ ప్రచారం చేసకుంటున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఘన్‌పూర్‌లో చేసిన అభివృద్ధి పనులేంటో డిమాండ్ చేశారు. టాల్ లీడర్ అని చెప్పుకునే కడియం ఏ పార్టీలో ఉన్నాడో చెప్పుకోలేని దయనీయస్థితిలో ఉన్నాడని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల శ్రమపై గెలిచిన కడియం శ్రీహరి తన బిడ్డ టికెట్, రాజకీయ భవిష్యత్ కోసమే పార్టీ మారాడని విమర్శించారు. స్టేషన్‌ఘన్‌పూర్ కొంతమంది అనుచరులు, తన బినామీలకు మాత్రమే కాంట్రాక్ట్ పనులు అప్పగిస్తున్నాడని అన్నారు. తన కాంట్రాక్టర్ల కోసమే ఎమ్మెల్యే కడియం పని చేస్తున్నాడని ఆరోపించారు.
సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని, వాటిని అమలు చేశాకే ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. కడియంకు సిగ్గు.. శరం ఉంటే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజల్లోకి రావాలని సవాల్ విసిరారు. మండలంలోని నారాయణగిరి గ్రామంలో ఇద్దరు కాంగ్రెస్ కార్యకర్తలు, మల్లక్‌పల్లి గ్రామ మాజీ ఎంపీటీసీ కొలిపాక రమ మండల అధ్యక్షుడు మునిగెల రాజు ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే రాజయ్య సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. రాజయ్య వారికి కండువాలుఎ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల ఇన్చార్జి కర్ర సోమిరెడ్డి, మాజీ ఎంపీపీ బండారి రవీందర్, లక్క శ్రీనివాస్, దేవేందర్ రావు, మండల రమేశ్, బొంతు కుమార్, శేషాల నరేశ్, భాస్కర్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.