హనుమకొండ చౌరస్తా, మే 23 : ఏళ్లుగా బదిలీలు లేకపోవడంతో జూనియర్ కాలేజీల్లోని లెక్చరర్లు ఇబ్బందిపడుతున్నా రు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చి 15 నుంచి 20 సంవత్సరాలుగా ఒకేచోట అవస్థల నడుమ విధులు నిర్వర్తిస్తున్నారు. స్థానచలనం కల్పించాలని నిత్యం ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులకు విన్నవిస్తున్నా ఫలితం లేకుండాపోతున్నది. దీంతో వారి పరిస్థితి దయనీయంగా మా రింది. ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా సుమారు 52 వరకు జూనియర్ కాలేజీలున్నాయి.
మే 2023 లో రాష్ట్రవ్యాప్తంగా 3,300 కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులర్ చేయగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో 250 మంది వరకు ఉన్నారు. ఎక్కడో సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి 20 ఏళ్లుగా పనిచేస్తున్నారు. ఒక్కొక్కరు ఇంటి నుంచి వందల కిలోమీటర్ల దూ రం వచ్చి అద్దె ఇళ్లలో ఉంటున్నారు. కుటుంబాలకు దూరంగా ఉండడం, ఏళ్లుగా స్థానచలనం లేకపోవడంతో స్థానికతను కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొం ది. మహిళలు ఇబ్బందులు పడాల్సి వస్తున్నది.
20 ఏళ్లుగా ఒకేచోట..
రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో లెక్చరర్ల బదిలీల సమస్య తీవ్రంగా మారింది. రెండు దశాబ్దాలుగా ట్రాన్స్ఫర్లు లేకుండా అదే కాలేజీలో కొనసాగుతూ కాంట్రాక్టు నుంచి రెగ్యులరైన లెక్చరర్లున్నారు. కొంతమంది ఎంటీఎస్ నుంచి రెగ్యులర్ అయినా 30 ఏళ్లుగా ఒకే చోట పని చేస్తున్నారు. ఒకేచోట దీర్ఘకాలం పనిచేయడంతో బోధనలో నూతనత్వం తగ్గిపోవడం, విద్యార్థులకు విభిన్న బోధనా పద్ధతులు అందకపోవడం వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. దీని ప్రభావం చివరకు ఫలితాలపై కూడా పడే అవకాశం ఉందంటున్నారు. సమయానుకూలంగా ట్రాన్స్ఫర్లు అమలు చేస్తే, లెక్చరర్లలో కొత్త ఉత్సాహం పెరిగి, బోధనా ప్రమాణాలు మెరుగుపడే అవకాశముంది. తద్వారా విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించవచ్చు. రెగ్యులర్, ఎంటీఎస్, కాంట్రాక్ట్, గెస్ట్ లేదా పార్ట్‌టైమ్ లెక్చరర్ పోస్టు, సబ్జెక్టు ఏదైనా ఐదేళ్లకుపైగా ఒకే చోట కొనసాగకుండా బదిలీలు చేయడం ద్వారా సమానత్వం, పారదర్శకత తీసుకురావచ్చని భావిస్తున్నారు.
అసలు కారణం ఇదే..
మే 2023లో రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ ప్రభుత్వం లో కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులర్ చేయగా, వారి సర్వీస్ ఇంకా మూడేళ్లు పూర్తికాలేదు. దీనివల్ల ప్రభు త్వం తీసుకొచ్చిన మూడేళ్ల నిబంధన వీరికి వర్తించ దు. అంటే వీరికి మరో రెండేళ్ల వరకు అవకాశం రా కపోవచ్చు. బదిలీలు అయితే పట్టణాల్లో పనిచేస్తున్న యూనియన్ లీడర్లు వేరే చోటుకు వెళ్లాల్సి వస్తుందని వారు ఇన్నేళ్లుగా ట్రాన్స్ఫర్లు చేయాలని ప్రభుత్వాలను అడగలేదనేది అసలు కారణమని జూనియర్ లెక్చరర్లు చెబుతున్నారు. తాము ఎన్నిసార్లు ఈ విషయాన్ని ప్రస్తావించినా దాటవేసే ప్ర యత్నం చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఈ అంశాన్ని పరిశీలించి స్టేషన్ సీనియారిటీ (కాంట్రాక్టు, రెగ్యులర్ పీరియడ్ రెండింటిని లెకించి) ప్రకారం ఒకేచోట ఐదేళ్లు పూర్తి చేసుకున్న వారిని వచ్చే విద్యాసంవత్సరం లోగానైనా బదిలీలు చేయాలని జూనియర్ లెక్చరర్లు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
కుటుంబానికి దూరంగా..
మా స్వగ్రామం తొర్రూరు మండలం చెర్లపాలెం. నేను జగిత్యాల జిల్లా మల్లాపూర్ జూనియర్ కాలేజీలో రాజనీతిశాస్రంలో కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్‌గా 2009లో అపాయింట్ అయ్యాను. నేను ఇకడ కుటుంబానికి దూరంగా 17 ఏళ్లుగా పనిచేస్తుండడంతో తీవ్రమైన వేదనకు గురవుతున్నా ను. నా భార్య తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాల హనుమకొండలో టీచర్‌గా పనిచేస్తున్నది. కుటుంబానికి దూరంగా పనిచేయడం కష్టంగా ఉంది. 2013లో ఐదేళ్లు ఒకేచోట పనిచేసిన వారిని బదిలీ చేశారు. అప్పుడు మాకు అవకాశం రాలేదు.
– అనుముల రాజేందర్, రాజనీతిశాస్త్ర అధ్యాపకుడు, ప్రభుత్వ జూనియర్ కాలేజీ, మల్లాపూర్, జగిత్యాల