కురవి, జూలై 08: కుష్టి వ్యాధి రహిత సమాజ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర లెప్రసీ జాయింట్ డైరెక్టర్ జాన్ బాబు అన్నారు. మంగళవారం బలపాల, కురవి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను రాష్ట్ర కుష్టు వ్యాధి నిర్మూలన బృందం సభ్యులు, జిల్లా కుష్టి వ్యాధి నిర్మూలన అధికారి డాక్టర్ విజయ్‌తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా లెప్రసీ జాయింట్ డైరెక్టర్ జాన్ బాబు మాట్లాడుతూ కుష్టి వ్యాధి రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఈ వ్యాధిని ప్రాథమిక దశలోని గుర్తించి పూర్తిగా నిర్మూలించవచ్చన్నారు. అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో ఈ వ్యాధికి ఉచితంగా మందులు లభిస్తాయని తెలిపారు.
స్పర్శ లేని రాగి రంగు మచ్చలను గుర్తించి తొందరగా చికిత్స చేయటం వలన వారికి ఎలాంటి డిఫార్మటీస్ లేకుండా ఉంటుందని తెలిపారు. జిల్లా కుష్టు నిర్మూలన అధికారి డాక్టర్ విజయ మాట్లాడుతూ 2027 సంవత్సరం నాటికి ఈ వ్యాధి మన దేశం నుండి నిర్మూలించడానికి ప్రతి ఒక్కరూ సమిష్టిగా బాధ్యత వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బలపాల, కురవి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులు డాక్టర్ స్రవంతి, డాక్టర్ విరాజిత, డాక్టర్ యశస్విని, రాష్ట్ర కుష్టు నిర్మూలన బృంద సభ్యులు సకలా రెడ్డి, వెంకటేశ్వర చారి, శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్స్ ఎల్లయ్య,కరణ్ రెడ్డి, సిహెచ్ఓ భద్రమ్మ, హెచ్ఈఓ గౌసుద్దీన్ , పిహెచ్ఎన్ శోభ తదితరులు పాల్గొన్నారు.