ములుగు, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ) : ములుగు జిల్లాలో అధికారులు, ఔట్స్ సోర్సింగ్ ఏజెన్సీ నిర్వాహకులు కుమ్మక్కై అంగట్లో సరుకులా ఉద్యోగాలను అమ్ముకుంటున్నారు. నోటిఫికేషన్ లేకుండానే గుట్టు చప్పుడు కాకుండా ఔట్ సోర్సింగ్ కొలువులను భర్తీచేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ములుగు జిల్లా కేంద్రంలోని నర్సింగ్ కళాశాలలో జరుగుతున్న ఈ త తంగం వెనుక అధికార పార్టీ నాయకులున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన అన్ని నర్సింగ్ కళాశాలల్లో అవసరం మేరకు ఔట్ సోర్సింగ్ పద్ధతిలో సిబ్బందిని భర్తీ చేసుకోవాలని 10 రోజుల క్రితం జీవో విడుదలైంది.
ఈ విషయం తెలుసుకున్న కొందరు అధికారు లు, అధికార పార్టీ నాయకులు గుట్టు చప్పుడు కాకుండా స్థానికంగా లేని ఓ ఔట్ సోర్సింగ్ ఏజె న్సీ ద్వారా భర్తీ ప్రక్రియను చేపట్టారు. రెండు రోజుల క్రితం సదరు ఏజెన్సీ నిర్వాహకుడు రెండు పోస్టులను భర్తీ చేయగా వారు విధుల్లో చేరారు. అయితే నిబంధనల మేరకు జిల్లా కలెక్టర్ చైర్మన్గా, మరికొందరు అధికారులు సభ్యులుగా కమిటీని ఏర్పాటు చేసి వివిధ మాధ్యమాల ద్వారా నోటిఫికేషన్ జారీ చేసిన అనంతరం దరఖాస్తులను స్వీకరించాలి. అర్హులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు, ఇతర సాంకేతిక పరీక్షలు నిర్వహించి పోస్టులను భర్తీ చేయాలి. వీటన్నింటిని తుంగలో తొక్కి అధికారులు, ఏజెన్సీ నిర్వాహకుడు డబ్బులిచ్చిన వారికే ఉద్యోగాలు కట్టబెడుతున్నట్లు తెలిసింది.
ములుగులో ఏర్పాలైన మెడికల్ కాలేజీ, దాని అనుబంధ దవాఖాన, నర్సింగ్ కాలేజీలో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండగా రూ. లక్షల్లో డబ్బులు వసూలు చేస్తూ అనర్హులు, స్థానికేతరులకు ఉద్యోగాలు కట్టబెడుతున్నారు. గతేడాది ఏప్రిల్లో మెడికల్ కళాశాలలో సైతం ఇదే రీతిన నోటిఫికేషన్ లేకుండానే సిబ్బందిని నియమించేందుకు అధికారులు యత్నించగా నిరుద్యోగుల పోరాటంతో కమిటీ వేసి ప్రక్రియను పూర్తిచేశారు.
నర్సింగ్ కళాశాలలో డాటా ఎంట్రీ ఆపరేటర్-2, రికార్డు అసిస్టెంట్-1, అసిస్టెంట్ లైబ్రేరియన్-1, మెకానిక్/ఎలక్ట్రిషియన్-1, ఆఫీస్ సబార్డినేటర్లు-4, డ్రైవర్లు-2, ల్యాబ్ అటెండెంట్లు-2, వంట మనుషులు-4, కిచెన్ బాయ్-4, మొత్తం 22 పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే కమిటీని ఏర్పాటు చేయకుండా, ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వకుండానే ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా పోస్టును బట్టి రూ. లక్ష నుంచి రూ. 2 లక్షలు వసూలు చేసి నియామక పత్రాలు ఇస్తుండడంతో ఒక్కొక్కరుగా విధుల్లో చేరుతున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఈ విషయమై పూర్తి విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు.