జనగామ, జూలై 11 (నమస్తే తెలంగాణ) : డీఎస్సీ వాయిదా వేయాలని కోరుతూ జనగామలో నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో గురువారం యువకులు మోకాళ్లపై నిల్చొని వినూత్న నిరసన తెలిపారు. నిరుద్యోగుల సమస్యల పరిష్కారం, డీఎస్సీ వాయిదా వంటి అంశాలపై కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ నిలదీయాలని నిరుద్యోగ జేఏసీ కన్వీనర్ మంగళంపల్లి రాజు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. తమకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని 33 లక్షల మంది నిరుద్యోగులు ఆ పార్టీని గెలిపించారని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగుల సమస్యలు పరిషరిస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఇప్పుడు నిరుద్యోగులు కోచింగ్ సెంటర్లకు అమ్ముడు పోయారని వ్యాఖ్యానించడాన్ని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ తీవ్రంగా ఖండిస్తున్నదని రాజు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిరుద్యోగ జేఏసీ, కేయూ జేఏసీ నాయకులు గన్ను కార్తీక్, ఆసర్ల సుభాష్ మాట్లాడుతూ.. డీఎస్సీకి చదువుకోవడానికి సమయం ఇవ్వాలని అంటుంటే పట్టించుకోని సీఎం రేవంత్‌రెడ్డికి ప్రభుత్వ పథకాల అమలు విషయంలో ఎందుకు సమయం ఇవ్వాలని నిలదీశారు. జేఏసీ నాయకులు తుంగ కౌశిక్, వెంపటి అజయ్ మాట్లాడుతూ.. నిరుద్యోగులకు అండగా ఉంటానన్న ప్రొఫెసర్ కోదండరామ్, ఎమ్మెల్సీలు తీన్మార్ మల్లన్న, బల్మూరి వెంకట్, ప్రొఫెసర్ రియాజ్ ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు రాజు, దినేశ్, అన్వేశ్, చరణ్ తదితరులు పాల్గొన్నారు.