బయ్యారం, మార్చి 3 : రాష్ట్ర పునర్విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్న ‘బయ్యారం ఉక్కు పరిశ్రమ’ ఏర్పాటు కోసం దాదాపు తొమ్మిదేళ్లుగా ఎదురుచూస్తున్న ఉమ్మడి జిల్లా యువత ఆశలపై కేంద్రంలోని బీజేపీ సర్కారు నీళ్లు జల్లినా.. రాష్ట్ర ప్రభుత్వం ‘ఉక్కు’ సంకల్పంతో ముందుకు పోతున్నది. యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారంలో స్టీల్ ప్లాంట్‌ను నెలకొల్పేందుకు ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ‘జిందాల్’ కంపెనీతో కలిసి వడివడిగా చర్యలు చేపడుతున్నది. ఇందులో భాగంగా రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో జేఎస్‌డబ్ల్యూ (జిందాల్ సౌత్ వెస్ట్) కంపెనీ ప్రతినిధులు మానుకోట జిల్లా మైనింగ్ అధికారులతో కలిసి గురు, శుక్రవారాల్లో బయ్యారం గుట్టల్లో ఉక్కు ఖనిజం లభ్యత, నాణ్యతపై అధ్యయనం చేయడం కొత్త ఆశలు రేపింది.
బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్నా కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ క్రమంగా నాన్చుతూ వచ్చి తర్వాత మాట తప్పింది. ఇక్కడ ఖనిజం నాణ్యతగా లేదనే కుంటి సాకుతో మొత్తానికే బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు హామీని అటకెక్కించింది. మోదీ ఆప్తమిత్రుడు అదానీకి లాభం కలిగించేలా ఎక్కడో గుజరాత్లో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు మార్గం సుగమం చేసి ఉమ్మడి జిల్లా యువత ఆశలపై నీళ్లు జల్లింది. ఈ క్రమంలో ఇక్కడి యవతకు జరుగుతున్న అన్యాయాన్ని ఓ వైపు ఎదిరిస్తూనే మరో వైపు ఉపాధి చూపేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం స్వయంగా రంగంలోకి దిగింది. ప్రముఖ పారిశ్రామిక కంపెనీ జేఎస్‌డబ్ల్యూ ప్రతినిధులను మంత్రి కేటీఆర్ జనవరి 12న ముంబైలో కలిసి బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కోరారు.
ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేస్తే కలిగే ప్రయోజనాలపై క్షుణ్ణంగా వివరించారు. ఈ నేపథ్యంలో బయ్యారం అడవుల్లో రెండు రోజుల పాటు మైనింగ్ అధికారులతో కలిసి జిందాల్ కంపెనీ ప్రతినిధులు పర్యటించారు. స్టీల్, సిమెంట్ రంగాల్లో పేరు గాంచిన జేఎస్‌డబ్ల్యూ కంపెనీకి చెందిన ఇద్దరు జియాలజిస్ట్‌లు, మహబూబాబాద్ జిల్లా మైనింగ్ ఇన్చార్జి ఏడీ రవీందర్, టీఏ నరేశ్‌తో కలిసి ఆరుగురు సభ్యులు గురు, శుక్రవారాల్లో బయ్యారం మండలంలోని పలు ఇనుప ఖనిజ నిక్షేపాలు కలిగిన గుట్టలను పరిశీలించారు. బయ్యారం మండలంలోని ఇర్సులాపురం, చర్లపల్లి, జాఫరాబాద్ , బాలాజీపేట, చింతోనిగుంపు గ్రామాలను అనుకొని ఉన్న పెద్ద గుట్టతో పాటు , ఇర్సులాపురం శివారులో ఉన్న నక్కల గుట్ట, మెట్ల తిమ్మాపురం శివారులోని ఎర్రమ్మ గుట్ట ప్రాంతాలను సర్వే చేశారు. గుట్టల్లో నిక్షిప్తమై ఉన్న ఉక్కు ఖనిజ లభ్యత, నాణ్య త వంటి వాటిపై ఆరాతీశారు. అధునాతన యం త్రాలను ఉపయెగించి శాంపిల్స్ సేకరించారు. ఈ ప్రదేశంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే ఎన్ని సంవత్సరాల పాటు ఖనిజం వెలికి తీయవచ్చు? అనేదానిపై అధ్యయనం చేశారు.
మంత్రి కేటీఆర్ చొరవతోనే..
జనవరి 12న ముంబైలో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే జేఎస్‌డబ్ల్యూ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జన్ జిందాల్‌తో కలిసి ప్రత్యేకంగా బయ్యారంలో ఉక్కు పరిశ్రమ పెట్టాలని చ ర్చించారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో బయ్యారంలో పరిశ్రమ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చిందని, ఇందుకు సెయిల్ సంస్థ కూడా సంసిద్ధత వ్యక్తం చేసిందన్న విషయాన్ని వారికి చెప్పారు. జేఎస్‌డబ్ల్యూ వంటి దిగ్గజ సంస్థ బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు ముందుకొస్తే అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో బయ్యారం అడవుల్లో జిందాల్ కంపెనీ జియాలజిస్ట్ల బృం దం సర్వే చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.