హనుమకొండ చౌరస్తా, జూలై 1: తెలంగాణ మలిదశ ఉద్యమంలో కాకతీయ యూనివర్సిటీ నుంచి కీలక భూమిక పోషించిన జెట్టి రాజేందర్ కాకతీయ యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ విభాగం నుంచి డాక్టరేట్ పట్టా పొందారు. దూరవిద్యా కేంద్రం మాజీ సంచాలకులు ఆచార్య చింతకాయల దినేష్ కుమార్ పర్యవేక్షణలో ‘పొలిటికల్ ఎంపవర్మెంట్ ఆఫ్ ట్రైబల్ ఉమెన్: ఎ స్టడీ విత్ రిఫరెన్స్టు పంచాయతీ రాజ్ ఇనిస్టిట్యూషన్ ఇన్ తెలంగాణ స్టేట్’ అనే అంశంపై ఆయన సమర్పించిన సిద్ధాంత గ్రంథానికి ఆయనకు పీహెచ్డీ అందించినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కట్ల రాజేందర్ తెలిపారు.
హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం బైరాన్‌పల్లి గ్రామానికి చెందిన జెట్టి చంద్రకళ-చేరాలు పెద్ద కుమారుడు డాక్టర్ జెట్టి రాజేందర్ ప్రస్తుతం భారత రాష్ర్ట సమితి విద్యార్థి విభాగం కాకతీయ యూనివర్సిటీ ఇంచార్జిగా కొనసాగుతున్నారు. మలిదశ ఉద్యమం నుంచి అనేక విద్యార్థి సమస్యలపై పోరాటం చేసి పలుమార్లు అరెస్టు అయ్యారు. పీహెచ్డీ సాధించిన సందర్భంగా రాజేందర్‌ను యూనివర్సిటీ అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, వివిధ విద్యార్థి సంఘాల నాయకులు, భారత రాష్ర్ట సమితి నాయకత్వం అభినందించింది.