తొర్రూరు, జూన్ 13 : కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాది జీలుగు విత్తనాల ధరలు భారీగా పెంచడం, అవి నాసిరకంగా ఉండడంతో రైతులు వాటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపలేదు. దీంతో వేల సంఖ్యలో మిగిలిన బస్తాలు తిరిగి వెనక్కి పంపించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. 30 కిలోల జీలుగ విత్తన బస్తా ధర గత ఏడాది రూ.1,116 ఉండగా, ఈ సారి దానిని రూ.2,137కి ప్రభుత్వం పెంచింది. ఒకో బస్తాపై దాదాపు రూ.1,000 అదనంగా చెల్లించాల్సి వస్తుండడంతో రైతులు వీటికి దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లాలోని 18 మండలాలకు మొత్తం 25,076 జీలుగు బస్తాలు కేటాయించగా, కేవలం 8,430 బస్తాలు మాత్రమే అమ్ముడయ్యాయి.
మిగతా 16,649 బస్తాల విక్రయం జరగకపోవడంతో వాటిని మళ్లీ వెనకి పంపిస్తున్నట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు. కొన్ని మండలాల్లోనే వీటి అమ్మకాలు ఎక్కువగా ఉండగా, చాలా చోట్ల రైతులు ముఖం చాటేశారు. ఇదే అదనుగా భావించిన దళారులు జీలుగ విత్తనాలను బ్లాక్ మార్కెట్ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇటీవల తొర్రూరు పట్టణానికి చెందిన చలువాది ఉపేందర్ జనగామ జిల్లాలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాల నుంచి సేకరించిన 69 క్వింటాళ్ల జీలుగ విత్తనాలను ఆంధ్రప్రదేశ్ నరసరావుపేటకు అక్రమంగా తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఉపేందర్‌తో పాటు ఏజెంట్లు శ్రీనివాసరెడ్డి, సురేశ్ సహా మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
మహబూబాబాద్ జిల్లాలో ప్రస్తుతం మిగిలి ఉన్న జీలుగ విత్తనాలను తకువ నిల్వలున్న ఇతర జిల్లాలకు సరఫరా చేసేందుకు సిద్ధం చేశాం. రైతులందరికీ విత్తనాలు అందేలా తగిన ఏర్పాట్లు చేశాం. అర్హత ఉన్న ప్రతి రైతు ఆన్లైన్ కూపన్ ద్వారా విత్తనాలు పొందేలా చర్యలు తీసుకున్నాం. దీని ద్వారా పారదర్శకతతో పాటు విత్తనాల కొరత లేకుండా చూస్తు న్నాం. జీలుగ విత్తనాల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తున్నాం. కలెక్టర్ ఆదేశాల మేరకు వ్యవసాయ, రెవె న్యూ, పోలీసు శాఖలతో కలిసి పనిచేస్తున్నాం. ఇప్పటికే జీలుగ విత్తనాల తరలింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అలాగే ఎవరైనా ఎలాంటి విత్తనాల అక్రమ దందాకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటాం.
– ఎం విజయనిర్మల, వ్యవసాయ అధికారి, మహబూబాబాద్ జిల్లా