హనుమకొండ, జూన్ 6 : ఎన్నికల్లో గెలుపోటములు సహజమని జడ్పీ చైర్మన్ మారెపల్లి సుధీర్‌కుమార్ అన్నారు. వరంగల్ ఎంపీగా గెలుపొందిన కడియం కావ్యకు శుభాకాంక్షలు తెలిపారు. గురువారం బాలసముద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డితో కలిసి సుధీర్‌కుమార్ విలేకరులతో మాట్లాడారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూనే ప్రజల పక్షాన పోరాటం చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ అమలు కాని ఆరు గ్యారెంటీలతో ప్రజలను మోసం చేస్తున్నదన్నారు. ఆగస్టు 15 లోగా రూ. 2లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి రైతులను మోసం చేస్తూ ఓట్లు దండుకుందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 64 మంది ఎమ్మెల్యేలతో గద్దెనెకిన కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో 8 సీట్లకే పరిమితమైందంటే ఆరు నెలల్లోనే ఎంత వ్యతిరేకత వచ్చిందో అర్థమవుతుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత ఇలాకాలో, ఇంతకుముందు ఎంపీగా గెలిచిన మలాజిగిరిలో సైతం బీజేపీ అభ్యర్థులు గెలిచారంటే సీఎం పాలన ఏ విధంగా ఉందో ఆలోచించాలని పేర్కొన్నారు.
ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ ఇంకా ప్రజలను మభ్యపెడుతున్న సీఎంకు లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. బీజేపీపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వచ్చిందని, అందుకే లోక్‌సభ స్థానాలు భారీగా తగ్గాయన్నారు. ఎన్డీఏ కూటమిలోని పార్టీలతో కలిసి మరోసారి నరేంద్ర మోదీ ప్రధాని కాబోతున్నారే తప్ప ఎన్నికలకు ముందు 400 సీట్లు గెలుస్తామన్న బీజేపీ గతంలో గెలిచిన సీట్లు కూడా గెలవలేదని ఎద్దేవా చేశారు. వరంగల్ లోక్ సభ స్థానంలో సుమారు 2.30 లక్షల పైచిలుకు ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి రావడానికి కృషి చేసిన పార్టీ నాయకులు, శ్రేణులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అభివృద్ధి, ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టాలని అన్నారు. కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కో ఆర్డినేటర్ పులి రజినీకాంత్, నాయకులు ఉడతల సారంగపాణి, జోరిక రమేశ్, నార్లగిరి రమేశ్, నయీమొద్దీన్, చింతల యాదగిరి, బండి రజినీ కుమార్, పోలపల్లి రామ్మూర్తి, సల్వాజీ రవీందర్ రావు, రమేశ్, కుసుమ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.