మహదేవపూర్ (కాళేశ్వరం) : మహదేవపూర్ మండల పరిధిలోని కాళేశ్వరం గ్రామంలో ప్రభుత్వ అనుమతి పొందిన వైన్‌షాపు నిర్వాహకులు నిబంధనలు పాటించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎక్సైజ్ శాఖ అధికారుల పర్యవేక్షణ లోపంతో వారి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. శుక్రవారం మండల కేంద్రానికి చెందిన పలువురు వ్యక్తులు కింగ్ ఫిషర్ లైట్ బీర్లను కొనుగోలు చేసేందుకు కాళేశ్వరం వైన్ షాపు వెళ్లారు.
వైన్‌షాపులో బీర్లు అందుబాటులో ఉన్న వారికి లేవని చెప్పారు. బీర్లు ఉండికూడా ఎందుకు లేవంటున్నారని ప్రశ్నించగా అవి బెల్ట్ షాపులకు మాత్రమే విక్రయిస్తామని చెప్పడం గమనర్హం. వైన్‌షాప్‌లో అందుబాటులో ఉన్న బీర్లను ఎమ్మార్పీ ధరకు కస్టమర్లకే విక్రయించాల్సి ఉండగా.. స్టాక్‌ను సమీపంలోని బెల్ట్ షాపులకు అధిక రేట్లకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
సంబంధిత శాఖ అధికారుల అండదండలతోనే వైన్ షాప్ నిర్వాహకులు రెచ్చిపోతున్నారని, షాప్‌కి వచ్చే కస్టమర్లతో ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారని, నిబంధనలు పాటించని షాప్‌లపై చర్యలు తీసుకోవాల్సిన ఎక్సైజ్ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నిబంధనలను పాటించని వైన్ షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలని అంటున్నారు.