శాయంపేట, ఆగస్టు 15 : దశాబ్దాల నాటి కల ఎట్టకేలకు నెరవేరింది. మండలంలోని దొంగల సింగారం పేరును ప్రగతిసింగారంగా మారుస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో గ్రామస్తులు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి, పటాకులు పేల్చి సంబురాలు జరుపుకున్నారు. ఈ గ్రామానికి దొంగల సింగారం పేరు వందల ఏండ్ల క్రితం నుంచి స్థిరపడిపోయింది. అన్ని రెవెన్యూ రికార్డులు, ప్రభుత్వ పథకాల్లో ఈ పేరే ఉండడంతో గ్రామస్తులు అవమానంగా భావించేవారు. 1998లో అప్ప టి కలెక్టర్ శాలినీమిశ్రా గ్రామం పేరును ప్రగతి సింగారంగా మారుస్తున్నట్లు ప్రకటించారు. కానీ, గెజిట్ రాకపోవడంతో రికార్డుల్లో దొంగల సింగారంగానే కొనసాగింది. కాగా, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి స్వగ్రామం ఇదే కావడంతో పేరు మార్పునకు ఆయన ప్రత్యేక చొరవ తీసుకున్నారు. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఆదివారం ప్రగతిసింగారం కూడలిలో ఎమ్మెల్యే చల్లా చిత్రపటానికి సర్పంచ్ పోతు సుమలతా రమణారెడ్డి పాలాభిషేకం చేశారు.