ఆడుకుంటూ ఎస్సారెస్పీ కాల్వ వద్దకు వెళ్లిన నలుగురు చిన్నారులు
సరదాగా ఈత కొట్టేందుకు కాల్వలోకి దిగుతుండగా తెగిన తాడు
నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి ఒకరి మృతి
దవఖానకు తరలిస్తుండగా మరొకరు..
ఇద్దరు బాలికలను కాపాడిన బాలురు
కేసముద్రం మండలం దుబ్బతండాలో విషాదం
అప్పుడే నూరేళ్లూ నిండాయా.. అంటూ తల్లిదండ్రుల రోదనలు
బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే శంకర్‌నాయక్ పరామర్శ
కేసముద్రం, మార్చి14 : ఈత సరదా ముక్కుపచ్చలారని రెండు పసి ప్రాణాలను బలితీసుకున్నది. కేసముద్రం మండలం దుబ్బతండాకు చెందిన రమ్యశ్రీ(9), వాసంతి(12), వైష్ణవి, ఇందు సోమవారం బడికి వెళ్లకుండా ఇంటి వద్దనే ఆడుకుంటూ పక్కనే ఉన్న ఎస్సారెస్పీ కాల్వ వద్దకు వెళ్లారు. సరదాగా ఈత నేర్చుకుందామని నలుగురు ఒకేసారి కాల్వలోకి దిగుతుండగా తాడుతెగి అందులో పడిపోయారు. నీటిలో మునిగి రమ్యశ్రీ, వసంతి మృతి చెందగా, మరో ఇద్దరు చిన్నారులను తండావాసులు కాపాడారు. అనుకోకుండా జరిగిన ఈ ఘటనతో ఒక్కసారిగా తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. అప్పటి వరకు కళ్లెదుట కదలాడిన చిన్నారులు విగత జీవులుగా మారడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. ‘అప్పుడే నూరేళ్లు నిండాయా.. బడికి వెళ్లినా బతికేవారేమో’ అంటూ గుండెలవిసేలా రోదించారు.
ఈత సరదా ఇద్దరు చిన్నారులను బలితీసుకున్నది. తల్లిదండ్రులకు తీరని కడుపుకోతను మిగిల్చింది. కేసముద్రం మండలం దుబ్బతండాకు చెంది న ధరావత్ మోహన్, నీల దంపతుల కూతు రు రమ్యశ్రీ(9), జాటోత్ రాము, అనిత దం పతుల కూతురు వసంతి(12), వాంకుడోత్ చక్రు, మంగమ్మ దంపతుల కుమార్తె వైష్ణవి, ధరావత్ లాలు, సరోజ దంపతుల కూతురు ఇందు మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారు. సోమవారం నలుగురు చిన్నారులు పాఠశాలకు వెళ్లకుండా ఇం టి వద్ద ఉండగా, తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లారు. మధ్యాహ్న సమయంలో వారు ఆడుకుంటూ తండా సమీపంలోని ఎ స్సారెస్పీ డీబీ ఎం-48 కాల్వ వద్దకు వెళ్లారు. కాగా, కాల్వలో ఈత కొట్టడానికని తండావాసులు ఒడ్డున కర్రను పాతి దానికి తాడు ను కట్టారు. అక్కడే ఆడుకుంటున్న రమ్యశ్రీ, వసంతి, వైష్ణవి, ఇందు ఈత నేర్చుకోవడాని కి తాడు సహాయంతో కాల్వలోకి దిగుతుండ గా తాడు తెగి అందులో పడిపోయారు.
అక్క డే ఉన్న నితిన్ అనే బాలుడు వారిని గమనిం చి కేకలు వేయడంతో రమ్యశ్రీ అన్న లోకేశ్, భరత్ అనే ఇద్దరు బాలురు విని కాల్వ వద్దకు చేరుకుని నీటిలో కొట్టుకుపోతున్న వారిని కాపాడేందుకు అందులోకి దిగారు. ఇందు, వైష్ణవిని బయటకు తీసుకొచ్చి, రమ్యశ్రీ, వసంతిని కాపాడేందుకు మళ్లీ కాల్వలోకి దిగారు. అప్పటికే వారు కాల్వలో కొట్టుకుపోతుండగా కొందరు తండావాసులు గమనించి నీటిలోకి దిగి వసంతిని బయటకు తీశారు. అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో చికిత్స నిమిత్తం మం డలకేంద్రంలోని దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. ఇక రమ్యశ్రీ మృతదేహం కొంతదూరంలో దొరికింది. ఇద్దరు చిన్నారులు మృతి చెందడంతో తండా లో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ దబ్బుతండాకు చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. అదనపు కలెక్టర్ కొమురయ్య, డీఎస్పీ సదయ్య, సీఐ రవికుమార్, తహసీల్దార్ ఫరీద్, ఎస్సై రమేశ్‌బాబు సంఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు.