గ్రేటర్ గ్రీవెన్స్‌లో కమిషనర్ ప్రావీణ్యకు ప్రజల వినతి
వరంగల్, మార్చి 14 సమస్యలను పరిష్కరించాలని బల్దియా గ్రీవెన్స్‌లో ప్రజలు కమిషనర్ ప్రావీణ్యను కోరారు. సోమవారం కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో నిర్వహించిన గ్రీవెన్స్‌లో వినతులు వెల్లువెత్తాయి. వివిధ కాలనీల నుంచి వచ్చిన ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులకు విన్నవించారు. ప్రజల నుంచి కమిషనర్ వినతులు స్వీకరించారు. ఇంటినిర్మాణ అనుమతుల మంజూరులో జాప్యం జరుగుతున్నదని పలువురు బాధితులు కమిషనర్ దృష్టికి తీసుకవచ్చారు. కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలు చేపట్టాలని పలు కాలనీ అభివృద్ధి కమిటీలు వినతిపత్రాలు అందచేశారు. మిషన్‌భగీరథ పైప్‌లైన్ పేర రోడ్లు తవ్వి వదిలివేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పలు కాలనీల ప్రజలు అదికారుల దృష్టికి తెచ్చారు. ప్రజారోగ్యం, టౌన్‌ప్లానింగ్, ఇంజినీరింగ్, పన్నుల విభాగాలకు సంబంధించిన సమస్యలపై ప్రజలు గ్రీవెన్స్‌లో అధికారులకు వినతులు అందచేశారు. గ్రీవెన్స్‌లో మొత్తంగా 64 వినతులు వచ్చాయి. టౌన్‌ప్లానింగ్ విభాగానికి 33, ఇంజినీరింగ్ విభాగానికి 18, ప్రజారోగ్యం 4, పన్నుల విభాగానికి 9 వచ్చాయి. కార్యదర్శి విజయలక్ష్మి, చీఫ్ ఎంహెచ్వో రాజారెడ్డి, సిటీప్లానర్ వెంకన్న, డిప్యూటీ కమిషనర్ రవీందర్ యాదవ్, జోనా పాల్గొన్నారు.
వినియోగదారుల రక్షణ చట్టంపై విస్తృత ప్రచారం అవసరం
వినియోగదారుల రక్షణ చట్టం 2019పై విస్తృత ప్రచారం కల్పించాలని గ్రేటర్ కమిషనర్ ప్రావీణ్య అన్నారు. సోమ వారం కార్పొరేషన్లో వినియోగదారుల సంఘం ముద్రించిన కరపత్రాన్ని ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వినియోగదారులకు జరుగుతున్న మోసాలపై చైతన్యపర్చాల్సిన బాధ్యత వినియోగదారుల సంఘాలపై ఉందన్నారు. కార్యక్రమంలో దక్షిణ భారత వినియోగదారుల సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లెపాటి దామోదర్, తెలంగాణ వినియోగదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సాంబరాజు చక్రపాణి, ఉపాధ్యక్షుడు పరికిపండ్ల వేణు, సభ్యులు రాయబారపు ప్రసాద్, వంగరి భాస్కర్, చీఫ్ ఎంహెచ్వో డాక్టర్ రాజారెడ్డి, సిటీప్లానర్ వెంకన్న, బల్దియా కార్యదర్శి విజయలక్ష్మి పాల్గొన్నారు.