సంగెం, ఫిబ్రవరి 12 : గన్ మిస్‌ఫైర్ కావడంతో ఓ హెడ్ కానిస్టేబుల్ దుర్మరణం చెందా డు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని గవిచర్ల గ్రామానికి చెందిన బుట్టి కొమురమ్మ, వెంకటయ్యల కుమారుడు సంతోష్‌యాదవ్(32) టీఎస్పీఎస్ 6వ బెటాలియన్‌లో 2018లో ఉద్యోగం పొందాడు. హైదరాబాద్‌తో పాటు ఏటూరునాగారంలో పనిచేసి 6 నెలల కిందట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లంద మండలం కాచనపల్లి పోలీసు స్టేషన్‌కు బదిలీపై వెళ్లాడు. శుక్రవారం రాత్రి విధుల్లో ఉన్న సంతోష్‌యాదవ్ గన్‌మిస్ ఫైర్ కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడని అధికారులు తెలిపారు. ఉన్నతాధికారులు సంతోష్‌యాదవ్ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీంతో కన్నీరు మున్నీరుగా రోదిస్తున్న తల్లిదండ్రులను జడ్పీటీసీ గూడ సుదర్శన్‌రెడ్డి, దొనికెల శ్రీనివాస్, సంపత్‌రెడ్డి ఇల్లంద దవాఖానకు తీసువెళ్లి పోస్టుమార్టం అనంతరం గవిచర్ల గ్రామానికి సంతోష్ మృతదేహాన్ని తీసుకువచ్చారు.
ఇటుక బట్టీల్లో పనిచేసి…
నిరుపేద కుటుంబంలో పుట్టిన సంతోష్‌యాదవ్ ఇటుక బట్టీల్లో పనిచేస్తూ, కష్టపడి చదివి పోలీసు ఉద్యోగం సంపాదించాడు. ఈక్రమంలో గన్ మిస్‌ఫైర్ అయి అతడు దుర్మరణం చెందడంతో గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. మృతుడికి తల్లిదండ్రులు, సోదరుడు రవి ఉన్నారు. శనివారం 6వ బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ వీరన్న ఆధ్వర్యంలో పోలీసు లాంఛనాలతో సంతోష్ అంత్యక్రియలు జరిగాయి.