15 నుంచి 18 ఏళ్ల వారికి వ్యాక్సిన్
విద్యాశాఖ నుంచి సమాచారం సేకరణ
బడి బయట పిల్లల కోసం అంగన్వాడీ, ఆశ వర్కర్లతో సర్వే
జనవరి 1 నుంచి కొవిన్ యాప్లో రిజిస్ట్రేషన్
3 నుంచి వ్యాక్సినేషన్ షురూ
జయశంకర్ భూపాలపల్లి, డిశంబర్ 29( నమస్తేతెలంగాణ): ఒమిక్రాన్ వేరియంట్ నుంచి పెద్దలతో పాటు పిల్లలను రక్షించేందుకు ప్రభుత్వాలు సన్నద్ధమయ్యాయి. వారి ఆదేశాల మేరకు 15 నుంచి 18 సంవత్సరాల వయసున్న వారికి టీకాలు వేసేందుకు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం విద్యాశాఖ అధికారుల నుంచి వివరాలు సేకరించే పనిలో సిబ్బంది నిమగ్నమైంది. పాఠశాలలతో పాటు ఇంటర్, డిగ్రీ కాలేజీ యాజమాన్యాల నుంచి జాబితా తీసుకుని జనవరి 1వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించనున్నారు. ఇదే నెల 3వ తేదీ నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభించేందుకు ఆ శాఖ అధికారులు సిద్ధంగా ఉన్నారు. దీనికి తోడు జిల్లాలో కరోనా మొదటి డోసు వ్యాక్సినేషన్ 100 శాతం పూర్తవగా, రెండో డోసు 70 శాతం పూర్తి చేసినట్లు డీఎంహెచ్వో శ్రీరామ్ తెలిపారు. త్వరలో వంద శాతం పూర్తి చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
కరోనా వేరియంట్ ఒమిక్రాన్ వ్యాపించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు జిల్లాలోని 15 నుంచి 18 ఏళ్లలోపు పిల్లలకు వ్యాక్సిన్ వేసేందుకు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ సన్నాహాలు చేస్తోంది. జిల్లాలో 15 నుంచి 18 సంవత్సరాల వయసున్న విద్యార్థుల వివరాలు తెలుసుకునేందుకు జిల్లా పాఠశాల, ఇంటర్మీయట్, డిగ్రీ కళాశాలల అధికారులు, యాజమాన్యాల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. అంతేకాకుండా బడి బయట ఉన్న పిల్లల వివరాలు సేకరించేందుకు జిల్లాలోని అంగన్వాడీ, ఆశ వర్కర్లతో సర్వే చేయిస్తున్నట్లు డీఎంహెచ్వో డాక్టర్ ధనసరి శ్రీరామ్ తెలిపారు. 18 సంవత్సరాలకు పైగా వయసున్న వారికి ఇప్పటి వరకు కరోనా మొదటి డోసు వ్యాక్సినేషన్ 100శాతం పూర్తి చేయగా, రెండో డోసు 70 శాతం పూర్తయినట్లు ఆయన చెప్పారు.
విద్యాశాఖ నుంచి వివరాల సేకరణ
జిల్లాలో ఇంటర్మీడియట్, డిగ్రీ కాలేజీల్లో సుమారు 6100 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. వీరందరికీ జనవరి 3వ తేదీ నుంచి వ్యాక్సిన్ ఇచ్చేందుకు వైద్య ఆరోగ్యశాఖ సన్నాహాలు చేస్తోంది.
బడిబయటి పిల్లల కోసం..
15 సంవత్సరాలకు పైగా వయసుండి బడి బయటి పిల్లల వివరాలు సేకరించాలని అంగన్వాడీ, ఆశ కార్యకర్తలను జిల్లా వైద్యాధికారి ఆదేశించారు. వీరు తమ పరిధిలోని కాలనీలు, గ్రామాల్లో ఉన్న పిల్లల వివరాలు సేకరించనున్నారు. ఆ వివరాల ఆధారంగా వ్యాక్సినేషన్ ప్రారంభించనున్నారు.
3వ తేదీ నుంచి వ్యాక్సినేషన్
గతంలో 18 సంవత్సరాలకు పైగా వయసున్న వారి కి ప్రభుత్వం కరోనా వ్యాక్సినేషన్ చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లాలో మొదటి డోసు 100 శాతం పూర్తవ గా, రెండో డోసు 70 శాతం పూర్తయినట్లు డీఎంహెచ్ వో తెలిపారు. 2022 జనవరి 3వ తేదీ నుంచి పిల్లలకు వ్యాక్సినేషన్ చేపట్టనున్నారు. అర్హులైన పిల్లల వివరాలను కొవిన్ యాప్లో జనవరి 1 నుంచి నమోదు చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.