ములుగు, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ) : అడవి రాజు పులికి ప్రాణానికి రక్షణ లేకుండా పోతోంది. ఎక్కడో ఓ చోట వేటగాళ్ల ఉచ్చుకు బలవుతూనే ఉంది. డబ్బు ఆశతో వాటిని మట్టుబెట్టే వారు కొందరైతే.. చర్మం, గోళ్లతో వ్యాపారం చేస్తున్న వారు మరికొందరు. తాజాగా ఛత్తీస్‌గఢ్ నుంచి పులి చర్మాన్ని రవాణా చేస్తున్న ఐదు సభ్యుల ముఠా ములుగు పోలీసులకు చిక్కింది. బీజాపూర్ జిల్లా ఆవుపల్లిలో కొనుగోలు చేసి వెంకటాపూర్(నూగూరు)కు తరలిస్తున్న క్రమంలో మంగళవారం వాజేడు మండలం జగన్నాథపురం వైజంక్షన్ వద్ద తనిఖీల్లో పట్టుబడింది. నాలుగు నెలల్లో మూడు పులి చర్మాలను స్వాధీనం చేసుకున్నామని, వన్యప్రాణులను వేటాడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ సంగ్రామ్‌సింగ్ జీ పాటిల్ హెచ్చరించారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఈ దందాలోకి దిగిన ప్రధాన నిందితుడు సహా ఐదుగురు ఏటూరునాగారం, వెంకటాపూర్(నూగూరు), కొత్తగూడేనికి చెందిన స్మగ్లర్లపై వన్యప్రాణి చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు.
పులి చర్మాన్ని విక్రయించేందుకు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ములుగు జిల్లా సరిహద్దు నుంచి వస్తున్న ఐదుగురు సభ్యుల స్మగ్లర్ల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం ములుగు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ స్మగ్లర్లతో పాటు పులి చర్మాన్ని చూపించి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పులి చర్మం రవాణా చేస్తున్నారనే పక్కా సమాచారంతో మంగళవారం ఉదయం వెంకటాపురం(నూగూరు) సీఐ కే శివప్రసాద్, వెంకటాపురం, వాజేడు ఎస్సైలు జీ తిరుపతి, కే తిరుపతిరావు సిబ్బందితో కలిసి వాజేడు మండలం జగన్నాథపురం వై జంక్షన్ వద్ద వాహన తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. ఈ క్రమంలో ఐదురుగు వ్యక్తులు రెండు ద్విచక్ర వాహనాలపై ఛత్తీస్‌గఢ్ నుంచి వస్తూ అనుమానాస్పదంగా పోలీసులకు కనిపించారని అన్నారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా బ్రౌన్ కలర్ సంచి కనిపించిందని తెలిపారు. దానిని విప్పి చూడగా పులి చర్మం తారసపడిందని చెప్పారు. వెంటనే ఎఫ్ఆర్వోకు సమాచారం అందించగా ఆయన వచ్చి పరిశీలించి పులి చర్మంగా నిర్ధారించారని తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా వివరాలు వెల్లడించారన్నారు.
ఐదుగురు వ్యక్తుల్లో వెంకటాపురం(నూగూరు) మండలం కొండాపురం గ్రామానికి చెందిన పూనెం విగ్నేశ్, సోయం రమేశ్, సోది చంటి, ఏటూరునాగారం మండలం గోగుపల్లి గ్రామానికి చెందిన చీర శ్రీను, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం చింతలంక గ్రామానికి చెందిన చింతల బాలకృష్ణ ఉన్నట్లు చెప్పారు. వీరిలో ప్రధాన నిందితుడైన పూనెం విగ్నేశ్ ఆటో నడుపుతుండే వాడు. ఏడాది కాంగా పనిలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడని చెప్పారు. ఈ క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కర్కగూడెం మండలానికి చెందిన దిలీప్‌తో స్నేహితుడు చీర శ్రీను ద్వారా పరిచయం ఏర్పడింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో పులి చర్మాన్ని సరఫరా చేసే వారు తనకు తెలుసని, తాము పులి చర్మాన్ని వారి నుంచి తీసుకువచ్చి తెలంగాణలో అధిక ధరకు విక్రయించి లాభాలు పొందుతున్నామని విగ్నేశ్‌కు తెలిపాడన్నారు. దీంతో సులువుగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఈ నెల 20న విగ్నేశ్ తన స్నేహితుడు చీర శ్రీను, సోయం రమేశ్, బాలకృష్ణ, చంటితో కలిసి రెండు బైక్‌లపై ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా ఆవుపల్లి గ్రామానికి వెళ్లి పులి చర్మాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. దానిని తెలంగాణలో విక్రయించేందుకు తెల్లవారు జామున ఆవుపల్లి గ్రామం నుంచి వస్తుండగా జిల్లా పరిధిలోని వై జంక్షన్ వద్ద పట్టుకున్నట్లు తెలిపారు. వీరి వద్ద నుంచి పులి చర్మంతో పాటు మూడు సెల్ ఫోన్స్, రెండు బైక్‌లను స్వాధీనం చేసుకుని తదుపరి విచారణ కోసం ఫారెస్టు అధికారులకు నిందితులను అప్పగించినట్లు ఎస్పీ చెప్పారు.
వన్యప్రాణులను వేటాడితే కఠిన చర్యలు తప్పవు
తెలంగాణ రాష్ట్రంలో వన్య ప్రాణుల చట్టాన్ని కఠినంగా అమలు చేసేందుకు పోలీస్, అటవీ శాఖ సంయుక్తంగా కలిసి పనిచేస్తున్నదని, వన్యప్రాణులను వేటాడే వారిపై నిరంతరం నిఘా ఉంటుందని ఎస్పీ సంగ్రామ్‌సింగ్ జీ పాటిల్ అన్నారు. ఛతీస్‌గఢ్ రాష్ట్రం నుంచి జాతీయ రహదారి మీదుగా స్మగ్లింగ్‌లకు పాల్పడుతున్నారని అన్నారు. గడిచిన నాలుగు నెలల కాలంలో మూడు పులి చర్మాలను నిందితుల నుండి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. జూలై 29న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి తరలిస్తున్న పులి చర్మాన్ని, అక్టోబర్ 3న ములుగు జిల్లాలో ఉచ్చుకు బలైన పెద్దపులి చర్మాన్ని, ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి జిల్లా మీదుగా తరలిస్తున్న పులి చర్మాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నిందితులను పోలీసులు చాకచక్యంగా పట్టుకుని వన్య ప్రాణుల చట్టం 1972 ప్రకారం శిక్ష పడేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న వారిని పట్టుకున్న సీఐ, ఎస్సైలు, పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. డీఎఫ్‌వో ప్రదీప్‌కుమార్‌శెట్టి మాట్లాడుతూ అడవుల ఖిల్లా అయిన ములుగు జిల్లా వన్య ప్రాణులకు నిలయంగా మారిందని, స్మగ్లర్లు వన్య ప్రాణులను వేటాడే చర్యలకు పాల్పడితే కఠినంగా శిక్షించనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఏటూరునాగారం, ములుగు ఏఎస్పీలు అశోక్‌కుమార్, సుధీర్రామ్నాథ్కేకన్, పోలీస్, ఫారెస్టు సిబ్బంది ఉన్నారు.