రైతుల ఖాతాల్లోకి రైతుబంధు సొమ్ము జమ
తొలిరోజు ఎకరం భూమి ఉన్న వారికి..
పది రోజులపాటు కొనసాగనున్న ప్రక్రియ
జయశంకర్, ములుగు జిల్లాల్లో 54,825 మందికి లబ్ధి
ఆనందం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు
జయశంకర్ భూపాలపల్లి/ ములుగు, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ);రైతుబంధు నిధుల పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. మంగళవారం తొలిరోజు ఎకరం వరకు వ్యవసాయ భూమి ఉన్న రైతుల బ్యాంకుఖాతాల్లో డబ్బులు జమ చేశారు. గతంలో మాదిరిగానే రోజుకొక ఎకరం చొప్పున పెంచుకొంటూ, పది రోజుల్లో పంపిణీ పూర్తి చేయనున్నారు. యాసంగి పెట్టుబడి సాయం కింద రాష్ట్ర ప్రభుత్వం ములుగు జిల్లాలో మొత్తం 74,774 మంది రైతులకు రూ.79.51 కోట్లు మంజూరు చేయగా తొలిరోజు 22,700 మంది ఖాతాల్లో రూ.7,22,67,595 నగదు జమ చేసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 1,10,673 మంది రైతులకు 115.06 కోట్లు మంజూరు చేయగా తొలిరోజు 32,125 ఖాతాల్లో రూ.10,05,69,011 నగదు జమ చేసింది. ఏటా వానకాలం, యాసంగి సీజన్లో పెట్టుబడికి రైతులు ఇబ్బంది పడకుండా సీజన్‌కు ఎకరాకు రూ.5వేల చొప్పున రూ.10వేలు అందిస్తున్నది. ఈ యాసంగి డబ్బులు కూడా బ్యాంకు ఖాతాల్లో జమవుతుండడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
‘రైతుబంధు’ సాయం వచ్చేసింది. అదునుకు సాయం చేస్తూ రైతన్నకు రంది లేకుంట చేస్తున్న కేసీఆర్ సర్కారు.. తాజాగా యాసంగికి పెట్టుబడి సొమ్మును వారి ఖాతాల్లో జమచేస్తున్నది. మంగళవారం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కాగా, బ్యాంకుల్లో నగదు అందుకుంటూ రైతాంగం మురిసిపోతున్నది. తొలిరోజు ఎకరం ఉన్న వారికి అందించగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 2,43,885 మందికి లబ్ధిచేకూరింది. పది రోజుల పాటు అర్హులందరికీ నగదు చేరనుండడంతో ఇక రంది లేకుండా ఎవుసం సాగిపోనున్నది. సాలుకు రెండు సార్లు పెట్టుబడికి కష్టాలు లేకుంట చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రుణపడి ఉంటామని రైతాంగం సంతోషంగా చెబుతున్నది.
కేసీఆర్ మాటే ఇంటం..
కృష్ణకాలనీ, డిసెంబర్ 28 : సీఎం కేసీఆర్ ఇచ్చే రైతుబంధుతో డబ్బులు కష్టకాలంల ఆసరా అయితయ్. రైతులకు ప్రతి సంవత్సరం ఎకరానికి రూ.10వేలు పెట్టుబడి సాయం ఇస్తూ రైతులను ఆర్థికంగా ఆదుకుంటున్నడు. ఈ పథకం లేకపోతే రైతులకు చాలా ఇబ్బంది అయ్యేది. నాకున్న ఎకరం భూమిలో పత్తి, పెసర పంట వేసిన. వాటికి ఎరువులు వేద్దామంటే డబ్బులు లేకుండె. మంగళవారం అకౌంట్ల డబ్బులతో ఎరువులు తెచ్చి వేస్తా. సీఎం కేసీఆర్ ఏటా పెట్టుబడికి దేవునోలె ఆదుకుంటున్నడు. ముఖ్యమంత్రికి రుణపడి ఉంటం.-గుర్రం మల్లయ్య, వేశాలపల్లి, భూపాలపల్లి
ఆ ధైర్యంతోనే ఎవుసం
నర్సింహులపేట, డిసెంబర్ 28 : రైతులకు ఏ బాధ లేకుంట అన్ని సౌలతులు చేస్తున్నడు సీఎం కేసీఆర్. ఆ సారు ఇచ్చిన ధైర్యంతోనే మేం ఎవుసం చేస్తున్నం. పంట పెట్టుబడి కోసం వానకాలం ఎకరానికి రూ.5వేలు ఇప్పుడు యాసంగికి రూ. 5వేలు బ్యాంకు ఖాతాలో పడ్డయ్. గిట్ల సాలుకు రెండు సార్ల అదునుకు సాయం చేసుడే కాదు.. రైతుకు ఏదన్న అయితే రూ.5లక్షల బీమా కూడా ఇచ్చి ఆ కుటుంబానికి భరోసా ఇత్తాండు. 24గంటల కరంటు కూడా ఉచితంగా ఇత్తాండు. గిసొంటి సర్కారు ఉన్నంక మాకు ఇగ రంది ఎందుకు.-జాటోత్ శ్రీను, ఎర్రచక్రుతండా, నర్సింహులపేట
పైసల్ పడ్డయ్..
భూపాలపల్లి టౌన్, డిసెంబర్ 28 : రైతుబంధు డబ్బులు నా బ్యాంక్ అకౌంట్లో పడ్డయ్. కేంద్రం యాసంగి వడ్లు కొనమని చెప్పింది కదా. ఇగ రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు డబ్బులు ఇస్తదో ఇయ్యదో అని అనుకున్నం. కానీ మా రైతులకు సాయం చేయడానికి ప్రభుత్వం వెనుకాడలేదు. నాకు 38 గుంటలకు రైతుబంధు వచ్చింది. ఇంటి అవసరాల మందమే వరి పండిస్త. ఆదునుకు ఆదుకుంటున్న సీఎం కేసీఆర్‌ను మరిచిపోము.-అనుసునూరి రాజవీరు, రైతు, గొర్లవీడు, భూపాలపల్లి
కష్టం లేకుంట జేసిండు..
సీఎం కేసీఆర్ చెప్పినట్టే యాసంగికి పంట పెట్టుబడి సాయం వచ్చింది. ఖాతాల రూ.5వేలు పడ్డయని మెసేజ్ వచ్చింది. రైతుల కోసం మంచి పథకాలు తెచ్చింది కేసీఆర్ సర్కార్ ఒక్కటే. తెలంగాణ వచ్చినంకనే మా రైతుల కష్టాలు తీరుతున్నయ్. ఇంతకుముందు పంట పెట్టుబడికి చాలా కష్టమైతుండె. పురుగుల మందు, ఎరువులు కొనేందుకు అదునుకు పైస ఉండకపోయేది. వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరిగి ఆగమయ్యేది. ఇప్పుడు ఆ బాధలన్నీ లేకుంట జేసిండు సీఎం సారు. రైతుల కోసం ఆలోచన చేస్తున్న ముఖ్యమంత్రికి రుణపడి ఉంటం.-సుంకరి నరేశ్, నర్సింహులపేట
అప్పుతెచ్చే పని లేదు..
మరిపెడ, డిసెంబర్ 28 : సీఎం కేసీఆర్ రైతుబంధు ఇచ్చుట్ల పెట్టుబడికి అప్పు తెచ్చే బాధ తప్పింది. వానకాలం, యాసంగికి రెండు సార్లు రైతులకు పైసలు ఇచ్చుడు చాలా సంతోషంగా ఉంది. నాకు మూడెకరాల భూమి ఉంది. ఏడాదికి రూ.30వేలు వస్తున్నయ్. ఎవుసాన్ని నమ్ముకున్న మాకు ఎలాంటి ఇబ్బంది లేకుంట చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రైతులమంతా రుణపడి ఉంటం. ఇంతకుముందు మమ్ముల పట్టించుకున్నోళ్లు లేరు. రైతుబంధు, రైతుబీమా, 24గంటల కరంటు ఇచ్చి అన్నితీర్ల సాయం చేత్తాండు.-అజ్మీరరెడ్డి, మరిపెడ