నివాళులర్పించిన ఎమ్మెల్యేలు, సినీ ప్రముఖులు, అభిమానులు
నాగుర్లపల్లిలో పూర్తయిన అంతిమ సంస్కారాలు
పెద్ద సంఖ్యలో తరలివచ్చిన జనం
కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకుంటాం : ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
నర్సంపేట రూరల్, మార్చి14: ప్రముఖ సినీ గేయ రచయిత కందికొండ యాదగిరికి అశ్రునయనాల మధ్య సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు. కళాకారుల నృత్యాలు, కోలాటాలు, డప్పుచప్పుళ్ల నడుమ అంతిమ యాత్ర కొనసాగింది. మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కందికొండ పాడెను మోశారు. కందికొండతో ఆయనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని కుటుంబసభ్యులకు భరోసా ఇచ్చారు. ఈ అంతిమ యాత్రలో అభిమానులు, ప్రజలు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు భారీగా పాల్గొనగా, కుమారుడు ప్రభంజన్ కందికొండ చితికి నిప్పంటించాడు.
ప్రముఖ సినీ, గేయరచయిత ‘కందికొండ’కు ఎమ్మెల్యేలు, పలువులు రాజకీయ, సినీ ప్రముఖులు, తోటి స్నేహితులు, కళాకారులు, అభిమానులు సోమవారం కన్నీటి వీడ్కోలు పలికారు. నర్సంపేట మండలం నాగుర్లపల్లిలో కందికొండ యాదగిరికి శోకతప్త హృదయాలతో కుటుంబసభ్యులు, బంధువులు అంతిమ దహన సంస్కారాలు నిర్వహించారు. రెండేళ్లుగా గొంతు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుండగా ఆరోగ్యం క్షీణించి శనివారం తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ మెట్టుగూడలో కందికొండ కిరాయి ఇంటినుంచి ఆయన పార్థివదేహాన్ని ఫిలించాంబర్‌కు తరలించి ప్రజలు, అభిమానులు, సినీ ప్రముఖులు, రాజకీయ ముఖ్య నాయకుల సందర్శనార్థం అక్కడే ఉంచారు. అనంతరం అదే రోజు రాత్రి 10.30గంటలకు కందికొండ పార్థివదేహాన్ని నాగుర్లపల్లికి తీసుకొచ్చారు. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి తొలుత కందికొండ మృతదేహానికి నివాళులర్పించి కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. అంతిమ సంస్కారాల పనులను దగ్గరుండి పరిశీలించారు. సోమవారం ఉదయం 11గంటలకు ప్రారంభమైన కందికొండ అంతిమ దహన సంస్కారాలు సాయంత్రం వరకు కొనసాగాయి. కళాకారుల నృత్యాలు, కోలాటాలు, డప్పుచప్పుళ్ల మధ్య అంతిమయాత్ర జరుగగా అభిమానులు, వివిధ గ్రామాల ప్రజలు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు భారీగా పాల్గొన్నారు. అంతిమయాత్రలో మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పాల్గొని పాడె మోశారు. గ్రామ శివారు మాదన్నపేట పెద్దచెరువు కట్ట సమీపంలోని వైకుంఠధామంలో దహనం చేయగా కుమారుడు ప్రభంజన్ చితికి నిప్పంటించారు.
ప్రభుత్వపరంగా ఆదుకుంటాం : ఎమ్మెల్యే రసమయి
కందికొండ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పేద కుటుంబం నుంచి పుట్టుకొచ్చిన మట్టి బిడ్డ కందికొండ అని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తన పాటలు, రచనల ద్వారా ముందుకు నడిపించిన గొప్ప వ్యక్తి అని అభివర్ణించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు అద్దం పట్టేలా బతుకమ్మ పాటలు రాశారని.. ఆ పాట ఖండాంతరాలు దాటిందని తెలిపారు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు నీటిపారుదల ప్రాజెక్టుల ప్రాముఖ్యత తెలిపే పాటలు రాసి అందరి మన్ననలు అందుకున్నారని గుర్తుచేశారు. అనేక చిత్రాలకు పాటలు అందించి అవార్డులు, డాక్టరేట్ పొందిన కందికొండ మన మధ్య లేకపోవడం బాధాకరమన్నారు. ఎల్లకాలం కందికొండ ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని, ఆయన కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ఈ సందర్భంగా బాలకిషన్ హామీ ఇచ్చారు. కందికొండ దవాఖానలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి కేటీఆర్ భారీగా ఆర్థిక సహాయం అందించినట్లు రసమయి చెప్పారు.
ప్రముఖుల నివాళి
కందికొండ కుటుంబాన్ని పలువురు నేతలు, సినీ ప్రముఖులు పరామర్శించారు. కందికొండ పార్థివదేహానికి తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నివాళులర్పించి ఆయన భార్య రమాదేవి, కుమారుడు ప్రభంజన్, కూతురు మాతృకతో పాటు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కందికొండ మృతదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్లు బోలే షావలి, లక్ష్మణ్, శ్రీను, లలిత ఆడియో, వీడియో బాధ్యుడు వినోద్, మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు హుస్సేన్‌నాయక్, బీజేపీ నేతలు ఎడ్ల అశోక్‌రెడ్డి, డాక్టర్ గోగుల రాణాప్రతాప్రెడ్డితో పాటు నర్సంపేట, దుగ్గొండి మండలాల్లోని పలు గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు కందికొండకు నివాళులర్పించారు.