ప్రతి కూలీకి రోజుకు రూ. 245
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఆనందం వ్యక్తం చేస్తున్న ఈజీఎస్ కూలీలు
శాయంపేట, ఏప్రిల్ 24: జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో పని చేస్తున్న కూలీలకు వేతనాలు పెంచారు. ఇప్పటి వరకు రోజుకు రూ. 237 చెల్లిస్తుండగా రూ. 245 పెంచుతూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. పెంచిన కూలి రేట్లు ఏప్రిల్ 1 నుంచి వర్తిస్తాయని పేర్కొన్నారు. ఉపాధిహామీ పథకంలో చేపట్టే వివిధ రకాల పనులకు 2021-22 ఆర్థిక సంవత్సరంలో కేటగిరీల వారీగా నిర్దేశించిన పనుల ప్రకారం కూలి రేట్ల పెంపు వర్తిస్తుందని తెలిపారు. ఎర్త్ వర్క్ పనుల్లో మినీ పర్క్‌లేషన్ ట్యాంకులు, పర్క్‌లేషన్ ట్యాంకులు, రాక్‌ఫిల్ డ్యామ్స్, బావులు, బండ్స్ పనుల్లో క్యూబిక్ మీటర్‌కు రూ. 202 నుంచి కేటగిరీల వారీగా రూ. 292 వరకు చెల్లించనున్నారు.
ఫాంపాండ్స్ పనుల్లో 1.50 లోతు తవ్వితే క్యూబిక్ మీటర్‌కు రూ. 225 నుంచి కేటగిరీల వారీగా రూ. 272 వరకు, ఇంతకు మించి తవ్వితే రూ. 315 నుంచి కేటగిరీల వారీగా రూ. 330 వరకు చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
కేటగిరీల వారీగా చెల్లింపులు..
సాధారణ నేలలో తవ్వితే క్యూబిక్ మీటర్‌కు రూ. 171, కఠిన నేలల్లో తవ్వితే రూ. 192 చెల్లించాలని ఆయా కేటగిరీల పనులకు నిర్దేశించారు. డీసిల్టింగ్ పనుల్లో క్యూబిక్ మీటర్‌కు రూ. 159 ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్లాంటేషన్ పనుల్లో సాధారణ నేలల్లో ఫిటింగ్కు ఒక్కో మొక్కకు రూ. 7.35 నుంచి సైజ్‌ను బట్టి రూ. 155 చెల్లించనున్నారు. అలాగే, గట్టి నేలల్లో రూ. 9.80 నుంచి తవ్విన సైజు ప్రకారం రూ. 186 ఇవ్వాలని తెలిపారు. టేక్బండ్/బ్లాక్ ప్లాంటేషన్ వాచర్‌కు మొక్కకు నెలకు రూ. 5.17 చెల్లించాలని నిర్దేశించారు. యూకలిప్టస్ ప్లాంటేషన్‌లో సర్వైవింగ్ ప్లాంట్లకు నెలకు ఒక్కోదానికి రూ. 1.03, ఈత ప్లాంటేషన్‌కు నెలకు మొక్కకు రూ. 5.17, హార్టికల్చర్ ప్లాంటేషన్‌కు నెలకు ఒక్కో మొక్కకు రూ. 15.51 చెల్లించాలని నిర్ణయించారు. ఇనిస్టిట్యూషన్ ప్లాంటేషన్‌లో నెలకు ఒక్కో మొక్కకు రూ. 5.17, కమ్యూనిటీ ప్లాంటేషన్‌లో నెలకు రూ. 5.17, రోడ్ సైడ్ ప్లాంటేషన్‌లో రూ. 400 మొక్కలకు నెలకు రూ. 6125 చెల్లించనున్నారు. ఇందుకు ఉపయోగించే నీళ్లకు ప్రత్యేక చెల్లింపు ఉంటుంది. మొత్తంగా 52 కేటగిరీలుగా ఉపాధి పనులను విభజించి పెంచిన రేట్లను ఫిక్స్ చేశారు. ఈ మేరకు ఉపాధి అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో కూలీల్లో ఆనందం వ్యక్తమవుతున్నది. నిర్దేశించిన పనులు చేస్తే కూలీ పెంపు వర్తించనున్నట్లు అధికారులు చెప్పారు.