భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి (Bhupalpally) జిల్లా గణపురం మండలంలో భార్యను చంపిన ఓ వ్యక్తి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. గణపురం మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన సంధ్య, బాలాజీ రామాచారి భార్యాభర్తలు. దంపతుల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సంధ్యకు తాడుతో ఉరిపెట్టి చంపేశాడు. అనంతరం తానూ ఉరేసుకుని బలవన్మరణం చెందాడు. సంధ్యను చంపిన తర్వాత భార్య, కూతురు వేధింపులు తాళలేక హత్య చేసినట్లు వీడియో తీసి వాట్సాప్ స్టేటస్‌లో పెట్టుకున్నాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను దవాఖానకు తరలించారు. కాగా, రామాచారికి గతంలో ఓ వివాహం జరిగిందని గ్రామస్తులు తెలిపారు. మొదటి భార్య చనిపోవడంతో సంధ్యను రెండో పెండ్లి చేసుకున్నాడని వెల్లడించారు.