చిట్యాల, మార్చి 11: కాంగ్రెస్ ఏలుబడిలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. పంటలకు నీరందక ఎండిపోతుండటంతో చేసిన అప్పులు ఎలా తీర్పాలో తెలియక తనువు చాలిస్తున్నారు. సోమవారం మహబూబ్నగర్, భువనగిరి జిల్లాల్లో అప్పుల బాధతో ఇద్దరు రైతులు బలవన్మరణం చెందగా, తాజాగా భూపాలపల్లి జిల్లా చిట్యాలలో (Chityala) ఓ యువ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. చిట్యాల మండలం కైలాపూర్ గ్రామ శివారు శాంతినగర్కి చెందిన మోత్కూరి కుమార్ (40) తనకున్న మూడెకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు.
తన భూమిలో విత్తిన మొక్కజొన్న పెరడి వద్ద అడవి పందులు, కోతుల బెడద వల్ల గత నాలుగు రోజులుగా రాత్రిపూట అక్కడే నిద్రిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి కూడా పంట చేనులో పడుకోవడానికి వెళ్తున్నట్లు చెప్పారు. అయితే మంగళవారం ఉదయం గ్రామ శివార్లలో రోడ్డు పక్కన కుమార్ నురుసులు కక్కుతూ విగత జీవిగా పడి ఉండగా స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. కుమార్ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతుడికి భార్య కవిత, కుమారుడు, కుమార్తె ఉన్నారు.