రేగొండ ఫిబ్రవరి 19 : జయశంకర్ జిల్లా రేగొండ మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల ఆశ్రమ పాఠశాలను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ(Collector Rahul Sharma,) బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీ అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. రేగొండ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్ విజయలక్ష్మి సంయుక్తంగా సందర్శించి హాస్టల్లో ఉన్న సమస్యలను విద్యార్థులు, ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడి విద్య బోధన, భోజన సదుపాయం ఇతర మౌలిక వసతులు ఎలా ఉన్నాయి? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆహార పదార్థాలు,వంట గదులు, మరుగుదొడ్లు, తరగతి గదులను పరిశీలించారు. హాస్టల్లో ఉన్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానన్నారు. అదేవిధంగా కేంద్రంలో నిర్మిస్తున్న మోడల్ ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని కడా పరిశీలించారు.